ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అయితే అందరికీ కాదు. జర్నలిస్టులకు మాత్రమే. దాదాపుగా 38 మంది జర్నలిస్టులు ఏపీలో చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షలు ఇచ్చేందుకు జగన్అంగీకరించారని జర్నలిస్టు సంఘాల నేత కే.శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. కరోనా బారిన పడిన జర్నలిస్టుల్ని ఆదుకోవాలంటూ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో 38 మంది జర్నలిస్టులు చనిపోయినట్లుగా సమాచారం ఉందని..అందరి కుటుంబాలకు .. రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కరోనా వారియర్స్‌గా జర్నలిస్టుల్ని ప్రకటించినందున రూ. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నామని.. చెప్పుకొచ్చారు.
జర్నలిస్టుగా ఉండి.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా మారిన దేవులపల్లి అమర్ కూడా ముఖ్యమంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉందని దేవులపల్లి అమర్ ముఖ్యమంత్రిని పొగడటానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయితే తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కరోనా బారిన పడిన ప్రతి జర్నలిస్టులుకు రూ. ఇరవై వేల సాయం చేశారు. ఏపీలోనూ అలాంటి సాయం చేయాలని చాలా రోజులుగా జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. దీనిపై జర్నలిస్టు సంఘాల నేతలు అసంతృప్తికి గురైనా లెక్కలోకి తీసుకోలేదు. చివరికి ఐజేయూ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ నుంచి శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగితే.. ఇప్పుడు మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని తక్షణం సాయం చేసి.. ఆ తర్వాత పబ్లిసిటీ చేసుకోవాలన్న సూచనలు.. ఏపీ జర్నలిస్ట్ సర్కిల్స్ నుంచి వస్తున్నాయి.