సెకండ్ వేవ్ తరవాత.. సినిమాలు ఉధృతంగానే వచ్చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒకే రోజు ఏడు సినిమాలు వచ్చాయి. అందులో ఎస్.ఆర్. కల్యాణమండపం ఒకటే నిలబడిగింది. ఆ సినిమాకి వసూళ్లు బాగుండడంతో – చిత్రసీమకు ఉత్సాహం వచ్చింది. ఈ వారం కూడా కొత్త సినిమాల ఊపు కనిపించడానికి కారణం అదే. ఈవారం.. 5 సినిమాలు బరిలో నిలవబోతున్నాయి. అందులో అందరి దృష్టీ విశ్వక్ సేన్ `పాగల్` పైనే. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన చిత్రమిది. నివేదా పేతురాజ్ కథానాయిక. ఈనెల 14న విడుదల చేయనున్నారు. నిజానికి ఓటీటీలో వెళ్లాల్సిన సినిమా ఇది. చివరి క్షణాల్లో థియేటరికల్ రిలీజ్ గా మార్చుకున్నారు.
సునీల్ హీరోగా నటించిన `కనబడుటలేదు` కూడా ఈవారమే వస్తోంది. ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. క్రైమ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది. ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఈ సినిమాపై ఫోకస్ పడింది. `సుందరి`, `బ్రాందీ డైరీస్`, `ఒరేయ్ బామ్మర్ది` సినిమాలు కూడా 13నే వస్తున్నాయి. ఈ చిత్రాల జాతకం బట్టి.. ఆగస్టు సినిమాల పరిస్థితి ఆధారపడి వుంది. ఆగస్టు 20, 27న కూడా కొన్ని కొత్త చిత్రాలు విడుదల కావాలని చూస్తున్నాయి. ఈవారం బాక్సాఫీసు కాస్త కళకళలాడితే – ఈ నెలంతా కొత్త సినిమాల జాతర చూడొచ్చు.