మే మూడో తేదీతో లాక్డౌన్ ముగియనుండటంతో… జోన్ల వారీగా.. ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జిల్లాలను ప్రకటించింది. గతంలో కూడా ఇలా ప్రకటించింది.అయితే అప్పుడు ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల్లో 11 జిల్లాలను రెడ్ జోన్లుగా డిక్లేర్ చేసింది. అయితే కొత్తగా ప్రకటించిన జాబితాలో మాత్రం ఆ సంఖ్యను 5కి కుదించారు. భారీగా కే్సులు నమోదుతున్న గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించారు. మిగతా చోట్ల.. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడానికి దీని ద్వారా అవకాశం లభించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం… ఆరెంజ్ జోన్లో ఉంది.
తెలంగాణలోని ఆరు జిల్లాలు హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో ఉన్నాయి. మిగతా జిల్లాలన్నీ ఆరెంజ్, గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నాయి. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగా రెడ్ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్ జోన్లో 284, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు ఉన్నాయి.
మూడో తేదీతో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ గడువు ముగిసిపోతోంది. దీనికి సంబంధించి తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. రెడ్ జోన్ జిల్లాల్లో మాత్రం.. ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ఆరెంజ్ జోన్లో నిబంధనలతో.. గ్రీన్ జోన్లలో పూర్తి స్థాయిలో వ్యాపార, వాణిజ్య కలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ ఏడో తేదీ వరకూ.. లాక్ డౌన్ ప్రకటించింది. ఆ తర్వాతే మినహాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.