తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. రాహుల్‌తో భేటీ కోసం.. అపాయింట్మెంట్ కోసం.. రోజుల తరబడి ఎదురు చూసే నేతలు.. ఇప్పుడు… ఆయన.. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినా.. వెళ్లడం లేదు. మంగళవారం..ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. దీనికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. లోక్ సభ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఖరారు కోసం.. రాహుల్ గాంధీ చేస్తున్న కసరత్తులో భాగంగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ తో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలను రాహుల్ అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు ఆడిగి తెలుసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రాహుల్. నియోజక వర్గాల వారిగా పార్టీ పరిస్థితి ని ఆడిగి తెలుసుకున్నారు. లోక్ సభ కోసం ఆశావహుల బలాబలాలను ఆరా తీశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద కూడా నేతల అభిప్రాయాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి సమావేశానికి రాహుల్ స్వయంగా ఆహ్వానం పంపారు. అయినప్పటికీ.. ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశానికి దూరంగా ఉన్నారు.
జగ్గారెడ్డి కొద్ది రోజులుగా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. సొంత పార్టీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రాహుల్‌తో భేటీకి ఆయన డుమ్మా కొట్టడం .. చర్చనీయాంశమవుతోంది. రాహుల్ సభను నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో సంగారెడ్డిలో రాహుల్ సభ నిర్వహించి సత్తా చాటారు జగ్గారెడ్డి. అయినప్పటికీ.. ఆయన దూరంగా ఉన్నారు. దీనికి కారణంగా.. రాహుల్ కోటరీ తనను అవమానించిందని… జగ్గారెడ్డి చెబుతున్నారు. రాహుల్‌తో భేటీ కోసం… జగ్గారెడ్డి ప్రయత్నిస్తే.. కొప్పుల రాజు.. అపాయింట్మెంట్ రాకుండా అడ్డుపడ్డారని… చెప్పేదేదో తనకు చెప్పి వెళ్లాలని సూచించారని.. జగ్గారెడ్డి హర్టయ్యారు. అందుకే ఆయన కాంగ్రెస్‌కు దూరంగా.. కేసీఆర్ కు దగ్గరగా మారుతున్నారు.