పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా ఈ రోజు కొల్లేరు పర్యటన సందర్భంగా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ కొల్లేరు లో పర్యటించినప్పటికీ, ఒక సమయంలో పర్యటన రద్దు కావచ్చని ఊహాగానాలు వినిపించాయి. వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ ఈరోజు కొల్లేరు పర్యటించనుండగా, అక్కడి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల పై ఎవరైనా పవన్ కళ్యాణ్ కి వెళితే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని, గ్రామస్తులెవరూ ఈ సభకు వెళ్లకూడదని ఆజ్ఞాపించినట్లు టీవీ ఛానల్లో వార్తలు రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఒకానొక సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించడంతో ఇవాళ కొల్లేరు పర్యటన రద్దు అయిపోయినట్టేనని జనసేన అభిమానులు భావించారు. ఇక ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకే గ్రామ పెద్దలు ఈ తీర్మానం చేసినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి.
ఈ సందర్భంగా కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ పర్యటన సజావుగా సాగింది. గ్రామస్తులు కూడా చాలామంది ఈ సభకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.