వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్స్.. కొనుగోలు వ్యవహారం ఏపీ సర్కార్ కు తలనొప్పిగా మారింది. చత్తీస్గఢ్ కొన్న ధరనే ..తాము చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దొరికి పోయిన తర్వాత ఇలా కవర్ చేసుకుంటున్నారని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని కాంట్రాక్టుల వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. వైరస్ దేశంపై దాడి చేయడం ప్రారంభించిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రాలకు విపత్తు నిధులు కేటాయించింది. ఆ నిధుల నుంచి వైద్య మౌలిక సదుపాయాలు … వైరస్ కట్టడి కోసం కావలసిన పిపిఈ సామాగ్రి… ఇతర వైద్య పరికరాలను రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా కేంద్రం నుంచి తమకు అందిన నిధులు 500 కోట్లు ఖర్చుపెట్టి పలు రకాల వైద్య సామాగ్రి కొనుగోలు చేసింది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఐదు వందల కోట్లు ఖర్చుకి ఎలాంటి లెక్కా పత్రం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సాధారణంగా ప్రభుత్వాలు ఎలాంటి వస్తువులు కొనాలన్నా టెండర్లు పిలుస్తాయి. ఎంతో అత్యవసరం అయితే నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అయితే దీనికి కూడా చాలా నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ వైరస్ ఖాతాలో ఖర్చుపెట్టిన 500 కోట్లకు ఎలాంటి టెండర్లు పిలవలేదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వారు సరఫరా చేసిన సామాగ్రి నాణ్యత గా ఉండడం లేదు. రేట్లు అధికంగా వసూలు చేశారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ టెండరింగ్ తమ డిస్కవరీ అన్నట్టుగా హడావుడి చేసింది.
పోలవరం నుంచి ప్రతి చిన్న ప్రాజెక్టు కు.. రివర్స్ టెండర్లు వేసింది. చిన్న చిన్న పనులు కూడా రివర్స్ టెండర్లకు వెళ్ళింది. చివరికి గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు కాంట్రాక్ట్ కూడా రివర్స్ టెండర్లకు వెళ్లినట్లు గొప్పగా ప్రభుత్వం ప్రకటించుకుంది. ఎంత ఆదా చేసాము అనేది సాక్షి పత్రికలో ప్రకటించుకునే వారు. ఇప్పుడు వైరస్ నియంత్రణ కోసం పెట్టిన 500 కోట్ల రూపాయల ఖర్చులో దేనికి టెండర్లు లేవు.. రివర్స్ టెండర్లు లేవు. ఇదే ప్రభుత్వంపై అనుమానాలు తలెత్తడానికి కారణం అవుతోంది.