హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. ఐదు వందల కోట్ల దళిత బంధు పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందే రూ. ఐదు వందల కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన వాటితో పోలిస్తే రూ. వెయ్యి కోట్లు హుజూరాబాద్ లో దళిత బంధు కింద పంచడానికి విడుదల చేయినట్లవుతోంది. దళిత బంధు ప్రారంభ సభలో పాల్గొన్న కేసీఆర్.. వారం, పది రోజుల్లో రూ. రెండు వేల కోట్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు మరో రూ. ఐదు వందల కోట్లను విడుదల చేశారు. వారం రోజుల్లోపు మరో రూ. 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైతు బంధు అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. సీఎం సభలో పదిహేను మందికి మాత్రమే చెక్కులు పంపిణీ చేశారు.
మిగతా వారికి ఇవ్వాల్సి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 21వేల దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించారు. ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పథఖాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. ప్రారంభించారు. అయితే ఇప్పుడు పూర్తిగా అమలు చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు నెలల్లో హుజూరాబాద్‌లో అందరికీ దళిత బంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే దళిత వర్గాల్లో అసంతృప్తి, అనుమానాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
మరో వైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగూ పథకాన్నిఅమలు చేయలేదన్న ఉద్దేశంతో దళిత, గిరిజన దండోరా.. దీక్షలు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని సీఎం దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో రెండు రోజుల దీక్ష ప్రారంభిస్తున్నారు. అక్కడకు మీడియాను తీసుకెళ్లి సీఎం ఏమీ చేయలేదని చూపించాలని డిసైడయ్యారు. రేవంత్ దూకుడుగా వెళ్తూండటంతో పథకాన్ని కూడా వేగంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిధులు మంజూరు కాగితాలపైనే ఉండటం కాకుండా వీలైనంత త్వరగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఏర్పడుతోంది.