పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లోక్ సభ స్థానంలో చోటు చేసుకున్న పరిణామాలు గుర్తున్నాయి కదా! పసుపు రైతుల కష్టాలను కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ… దాదాపు 180 మంది రైతులు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ల వేశారు. ముఖ్యమంత్రి కుమార్తె కవిత పోటీ చేసిన నియోజక వర్గం కావడంతో, వారితో నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు జరగని ప్రయత్నాలంటూ లేవు! మొత్తానికి, అక్కడ కవితకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు అదే తరహాలో సీఎం కేసీఆర్ తీరు మీద నిరసన తెలిపేందుకు సర్పంచుల సంఘం సిద్ధమౌతున్నట్టు సమాచారం.
జాయింట్ చెక్ పవర్ ని శాసన సభ సమావేశాలు ముగిసేలోపు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం హైదారాబాద్ లో జరిగింది. సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి, భాజపా నాయకురాలు డీకే అరుణ, టీజేఎస్ అధ్యక్షుడు కె. కోదండరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 73వ రాజ్యాంగ సవరణతో సర్పంచులకు వచ్చిన అధికారాలను వెంటనే బదిలీ చేయాలనీ, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్థావనకు వచ్చి… త్వరలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో తెరాసకి వ్యతిరేకంగా 500 మంది సర్పంచులు నామినేషన్లు వేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై సర్పంచులు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే, దీనిపై సంఘంలో చర్చించి, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సర్పంచులు అన్నారు.
500 సర్పంచులు హుజూర్ నగర్లో నామినేషన్లు వేస్తే… అది మరోసారి చర్చనీయాంశం అవుతుంది. అయితే, హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ. అక్కడ తెరాస గెలిస్తే బోనస్… ఓడితే పెద్దగా నష్టమేం లేదు. అలాగని గెలిచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ తెరాస వదులుకోదు. ఇది అలాంటి అవకాశం అవుతుందా అనేదే అనుమానం!
కానీ, ఇప్పుడు 500 మంది సర్పంచులతో నామినేషన్లు వేయిస్తే… అది కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతుందా అనేదే ప్రశ్న? నిజామాబాద్ తరహాలో ఇక్కడ కూడా అదే వ్యూహం అనురిస్తే వర్కౌట్ అవుతుందా..? నామినేషన్ల సంఖ్య పెరిగితే చీలిపోయే ఓట్లు ఎవరివి అవుతాయి..? ఇదే పరిస్థితిని కాంగ్రెస్ ని ఓడించడానికి అనుకూలంగా మార్చుకునేందుకు అందివచ్చిన అవకాశంగా మార్చుకునే ప్రయత్నం తెరాస చెయ్యకుండా ఉంటుందా..?