బీజేపీ నేతలకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ ఈటల రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇప్పటికీ ట్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కూడా అంత కంటే పెద్ద మేనిఫెస్టో విడుదల చేశారు. గెలవగానే రూ.200 కోట్లతో రోడ్లు, చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, రూ. 25 కోట్లతో ఐటీఐ, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం, మూసీ నీళ్లను ఎత్తి పోసే పథకం, వీధి వ్యాపారులకు రూ.10 వేల సాయం, చౌటుప్పల్లో ఈఎస్ఐ హాస్పిటల్, రూ. 100 కోట్లతో క్రీడా మైదానం , ఇంకా వాటర్ ట్యాంకులు , ఇతర అభివృద్ధి అంతా చేసేస్తారట.
ఇన్ని హామీలు ఎప్పట్లోపు అమలు చేస్తారంటే.. ఐదు అంటే ఐదు వందల రోజుల్లో అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పదవి కాలం ఉండేది ఏడాది మాత్రమే. అందులోనూ చివరి మూడు నెలలు ఎన్నికల సీజన్. నాలుగేళ్లుగా మునుగోడుకు రాజగోపాల్ రెడ్డినే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నాలుగేళ్లుగా ఆయన ఏమీ చేయలేదు. అయితే మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అవసరాల కోసం రాజీనామా చేసి.. ఇంత కాలం ఏమీ చేయకుండా ఇప్పుడు అన్నీ చేసేస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
కేంద్రం పెద్దలతో మాట్లాడే ఈ హామీలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలుకూడా నేరుగా అందవు. రాష్ట్రం ద్వారా అందాల్సిందే. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే అయినప్పటికీ నేరుగా కేంద్రం నుండి నిధులు తెస్తామని..టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా పర్వాలేదని అంటున్నారు. దీన్ని ప్రజలు నమ్మితే బీజేపీకి పండగే.