ఫామ్‌హౌస్ కేసు ఓపెనింగేనని ఇంకా చాలా ఉంటాయని కేటీఆర్ ఇలా ట్వీట్ చేయగానే అలా ఆయనకు సిగ్నల్ వచ్చేసింది. ఇతర స్కాముల్లో ఆరోపణలు ఉంటాయి కానీ కేటీఆర్ చేసిన ఓ తొందరపాటు పని వల్ల ఏకంగా రూ. 55 కోట్లు లెక్కాపత్రం లేకుండా వేరే కంపెనీ ఖాతాలో చేరిపోయాయి. ఇప్పుడు అదే ఆయనకు పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.
తమ దగ్గర రూ. 55 కోట్ల ఎవరో కొట్టేశారని ఆరోపిస్తూ మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేయడానికి ఏసీబీ ప్రభుత్వ అనుమతి కోరింది. పొంగులేటి చెప్పినట్లుగా బాంబులు పేలాలంటే ఏసీబీకి అనుమతి ఇస్తారు. ఆ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిందని.. కేసును ఎలా డీల్ చేయాలోకూడా మొత్తం రెడీ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫార్మలా ఈ కేసున కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి విడత ఘనంగా నిర్వహించారు. రెండో విడతకు వచ్చే సరికి స్పాన్సర్లు అందరూ సర్దుకోవడంతో నిర్వహణ సంస్థకు ఖర్చులన్నీ తామే పెట్టుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముందుగా రూ. యాభై ఐదు కోట్లు బదిలీ చేసింది. అందుకు కనీసం కేబినెట్ అనుమతి తీసుకోలేదు. కనీసం రాతపూర్వక అనుమతి లేదు. ఇది తీవ్రమైన నేరం. ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ దే వచ్చి ఉంటే కవర్ చేసుకునేవాళ్లు.కానీ ప్రభుత్వం మారింది.
మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ ప్రభుత్వం మారగానే తనకేమీ సంబంధం లేదని కేటీఆర్ నోటి మాటగా చెప్పారని డబ్బులు బదిలీ చేశానని స్టేట్ మెంట్ ఇచ్చారు. దాని ఆధారంగా ఏసీబీ నేరుగా కేటీఆర్ వద్దకు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఇందులో నేరుగా గోల్ మాల్ ఉంది కాబట్టి కేటీఆర్ ఇంకా వేధింపులు ఉంటాయని చెబుతున్నారని భావిస్తున్నారు.