ఏపీలో నామినేటెడ్ పోస్టుల మరో జాబితాను ప్రకటించారు. ఈ సారి 59 మందికి చాన్సిచ్చారు. బీజేపీ నేతలు ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. జనసేన నేతలకు దాదాపుగా పది మంది వరకూ అవకాశం లభించింది. సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలు, మీడియా ఎదుట పార్టీ భావజాలాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి.. ఎన్నికల్లో దాడులు ఎదుర్కొన్న వారికి కూడా అవకాశం కల్పించారు.
అధికార ప్రతినిధులుగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీవీ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డిలకు ప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి .. అలాగే జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడీకి పదవి వచ్చింది. ఆయనకు గతంలోలా కాపు కార్పొరేషన్ పదవి వచ్చింది. సుజయ్ కృష్ణ రంగారావు, రావి వెంకటేశ్వరరావు, కావలి గ్రీష్మ, కిడారి శ్రవణ్ వంటి వారందరికీ అవకాశం లభించింది.
చంద్రబాబు అరెస్టు సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పొడపాటి తేజస్వినికి కూడా ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పోలింగ్ రోజు మాచర్లలోని రెంటచింతలలో వైసీపీ దాడులకు గురైన ఏజెంట్ మంజులా రెడ్డికి ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ సొసైటీ చైర్మన్ పదవి ఇచ్చారు. జాబితాలో పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయి. కేసులకు వెరువకుండా పోరాడిన వారు.. అనేకమంది పదవులు దక్కించుకున్నారు.
చాగంటి కోటేశ్వరరావుకు ఏ పార్టీ కోటాలోనూ చూపించలేదు. ఆయనను సలహాదారుగా ప్రకటించారు. ఆయనకు కెబినెట్ ర్యాంక్ ఉంటుంది. మాజీ మండలి చైర్మన్ షరీఫ్‌కు కూడా కేబినెట్ ర్యాంక్ తో సలహాదారు పదవి ఇచ్చారు.