మోజో టీవీ మూసివేతకు నిర్ణయం తీసుకున్న కొత్త యాజమాన్యం.. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిలో పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఉద్యోగుల్లో ఎలాగోలా విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా… కొత్తగా సోషల్ మీడియాలోనూ… అదే యాజమాన్యం చేతిలో ఉన్న ఓ టీవీ చానల్ లోనూ వస్తున్న న్యూస్‌లు చెబుతున్నాయి. ఈ వార్తల్లో ఉద్యోగులను తాము గొప్పగా చూసుకుంటున్నామని.. నిబంధనల ప్రకారం..ఉద్యోగులకు తీసివేసేటప్పుడు.. మూడు నెలల జీతం ఇచ్చేందుకు .. మాజీ సీఈవో రేవతికి రూ. ఐదు కోట్లు ఇచ్చినట్లుగా .. ఆ సొమ్మును రేవతి తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. కొన్ని వెబ్ సైట్స్లోనూ ఇలానే ప్రచారం చేయడంతో.. మోజో టీవీ ఉద్యోగులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త యాజమాన్యం ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
తీసేసిన సీఈవోకు రూ. ఐదు కోట్లు ఇచ్చే యాజమాన్యం ఎక్కడైనా ఉంటుందా..?
మోజో చానల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్న మోజో టీవీ కొత్త యాజమాన్యం.. ఉద్యోగులందరికీ… హుకుం జారీ చేసింది. ఒక్క నెల జీతం అదనంగా తీసుకుని… అందరూ రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే ఉద్యోగులు మాత్రం.. దానికి ఒప్పుకోలేదు. పోరుబాట పట్టారు. యాజమాన్యం.. చానల్ ఎక్విప్మెంట్ను రూ. 12కోట్లకు అమ్మేసి.. ఒ సొమ్మును స్వాహా చేయాలని అనుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. యాజమాన్యం వినేలా లేకపోవడంతో.. ఉద్యమబాట పట్టారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి పోరాటానికి మద్దతు కోరారు. దానికి రేవంత్ కూడా సై అయ్యారు. దీంతో.. యాజమాన్యం మరింత సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగుల పోరాటం వెనుక రేవతి ఉందని యాజమాన్యం అనుమానం..!
అయితే.. ఉద్యోగుల ఉద్యమం ఉన్న.. మాజీ సీఈవో రేవతి ఉన్నారనేది.. యాజమాన్యం అనుమానం. ఆమె ఉద్యోగుల ఉద్యమానికి వెనుకుండి నడిపిస్తున్నారని.. గట్టిగా నమ్ముతూండటంతో.. ఉద్యోగులకు.. ఆమెపై నమ్మకాన్ని తగ్గించడానికి వారికి ఇవ్వాల్సిన సొమ్ము.. ఆమె తీసుకుందనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. మోజో టీవీలో ఏం జరిగిందో.. మొదటి నుంచి తెలిసిన ఉద్యోగులు మాత్రం.. ఎవరూ నమ్మడం లేదు. రేవతిని.. చానల్ సీఈవోగా తొలగించి.. రెండు నెలలు అవుతోంది. ఆ తర్వాత ఆమెను.. తమ పలుకుబడితో జైలుకు పంపారన్న ప్రచారమూ జరిగింది. మోజో టీవీని మూసివేయాలని నిర్ణయాన్ని ఇటీవల తీసుకున్నారు. అలాంటప్పుడు… ఉద్యోగులకు మూడు నెలల జీతాన్ని ఇవ్వాలని.. ఆమెకు వ్యక్తిగతంగా.. ఎందుకు రూ. ఐదు కోట్లు ఇస్తారు.. అనేది ఉద్యోగుల లాజిక్. ఈ అనుమానం… మోజో టీవీలోని వారికే కాదు.. చాలా మంది సామాన్యులకు కూడా వస్తుంది.
ఎన్ని చేసినా ఉద్యమం ఆపబోమంటున్న మోజో ఉద్యోగులు..!
మోజో టీవీ యాజమాన్యం ఇప్పటికే… ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు వ్యతిరేకంగా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న పలువురు ఉద్యోగుల్ని.. రాత్రికి రాత్రి టెర్మినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వారిని.. ఆఫీసులోకి వెళ్లనివ్వలేదు. రాను రాను.. మోజో టీవీ వివాదం… తీవ్ర రూపం దాల్చుతోంది. ఓ వైపు.. అసత్య ప్రచారాలు.. మరో పోలీసుల సాయంతో.. తమపై ఉక్కుపాదం మోపుతున్నారని… మోజో టీవీ ఉద్యోగులు అంటున్నారు. ఏం చేసినా.. వెనక్కి తగ్గబోమని అంటున్నారు. ఈ వివాదం తీవ్రమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.