ప్రతీ రోజూ పండగేతో మరో హిట్టు కొట్టాడు మారుతి. యావరేజ్ టాక్తో మొదలైనా, ఈ సినిమా ఇప్పుడు లాభాల బాట పట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని తీర్చిదిద్దడంలో మారుతి ముద్రేమిటన్నది మరోసారి తెలిసొచ్చింది. డివివి దానయ్య కుమారుతితో మారుతి ఓ సినిమా చేయాలి. ఇది వరకే ఒప్పందాలు జరిగిపోయాయి. కాకపోతే మారుతి ఆలోచనలు మారుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఆఫర్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. మారుతి మరో ఆప్షన్ వెదుక్కుంటాడేమో అని దానయ్య భావించాడో ఏమో.. ఏకంగా రూ.6 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు.. మిగిలిన కాస్ట్ అండ్ క్రూ విషయంలో మారుతికే సర్వాధికారాల్ని అప్పగించార్ట. ఇది మారుతి కాదనలేని పారితోషికం. తనదైన మార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో కథని నడిపిస్తే.. యావరేజ్ టాక్ వచ్చినా సరిపోతుంది. మరోవైపు దిల్రాజు కూడా మారుతితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే హీరోలే ఇప్పుడు ఖాళీగా లేరు. నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్… మారుతి శైలికి సరిగ్గా సరిపోతారు. వాళ్లేమో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈలోగా దాయన్య వారుసుడితో సినిమా తీసేస్తే… అప్పటికి హీరోలెవరైనా ఖాళీ అవుతారేమో చూద్దామన్నది మారుతి ప్లాన్.