విశాల్‌కి మంచి మార్కెట్ ఉంది. తెలుగు, తమిళం.. రెండు చోట్లా – తన సినిమాకి టికెట్లు తెగుతాయి. అభిమన్యుడుతో మంచి హిట్టు కూడా దక్కించుకున్నాడు. అయితే…తనది రూ.50 కోట్ల రేంజ్ మాత్రం కాదు. అలాంటిది.. తన కొత్త సినిమా `యాక్షన్`కి ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా చెప్పాడు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అనీ, అందుకే 60 కోట్లు పెట్టాల్సివచ్చిందని, అయితే తెరపై 150 కోట్ల సినిమాలా కనిపిస్తుందని చెబుతున్నాడు విశాల్.
విశాల్ సినిమా ఎంత పెద్ద హిట్టయినా తెలుగులో 5 – 6 కోట్ల రేంజ్ దాటదు. తమిళంలో మహా అయితే 20 కోట్లు చేస్తుందేమో. శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 10 కోట్లు అనుకున్నా, 60 కోట్ల మైలు రాయికి దరిదాపుల్లో కూడా వెళ్లదు. అంటే… విశాల్ తన జీవితంలోనే అత్యంత పెద్ద రిస్క్ తీసుకున్నాడన్నమాట. ఏమో..? ఎవరు చెప్పగలరు.. విశాల్ తన పాత రికార్డులన్నీ ఈ సినిమాతో బద్దలు కొడతాడేమో..? పైగా ఈమధ్య తెలుగులో డబ్బింగ్ సినిమాలు బాగానే ఆడాయి. ఖైదీ, విజిల్ – దీపావళికి హడావుడి చేశాయి. విశాల్‌ని కూడా తమిళ హీరో అనుకోరెవ్వరు. తమన్నా గ్లామర్ మరో ప్లస్ పాయింట్. విశాల్‌ని గట్టెక్కించాల్సినవి ఇవే.