అమరావతి ఉద్యమానికి 600 రోజులు అయిన సందర్భంగా అక్కడి రైతులు చేపట్టాలనుకున్న నిరసన ర్యాలీలను పోలీసులు ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. రాజధానికి భూములు రైతులు ఉన్న 29 గ్రామాల్లో ఉదయం నుంచి పోలీసుల ఇనుపబూట్ల చప్పుళ్లే వినిపించాయి. వందల మంది పోలీసుల్ని మోహరించారు. ఉద్యమకారులు ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. గుంటూరు రేంజి ఐజీ త్రివిక్రమ వర్మ గ్రామాల్లోనే మకాం వేసి..పరిస్థితిని పర్యవేక్షించారు. అమరావతి ఉద్యమ శిబిరాల్లోకి ఎవరినీ వెళ్లనీయలేదు. బయట నుంచి ఉద్యమానికి సంఘిభావం తెలుపడానికి ఎవర్నీ రానీయలేదు. చివరికి మీడియాను కూడా అనుమతించలేదు.
అమరావతి ఉద్యమానికి 600 రోజులు అయిన సందర్భంగా ర్యాలీలు నిర్వహించడానికి జేఏసీ నేతలుఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. అయినా నిర్వహిస్తారన్న ఉద్దేశంతో ఎక్కడిక్కకడ రోడ్లపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. తుళ్లూరు గ్రామంమలో రైతులు దీక్షా శిబిరం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పోలీసుల్ని చేధించుకుని ర్యాలీగా ఉండవల్లి వైపు వెళ్లిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన రైతులపై లాఠీచార్జ్ కూడా చేశారు.
రాజధాని గ్రామాల్లో పోలీసులు .. ఆ గ్రామ వాసులను కూడా బయటకు రాకుండా కట్టడి చేశారు. బయటకు వచ్చిన వారి ఐడీకార్డులు చూపించాలని నిర్బంధించారు. అయితే పలు చోట్ల.. తమ గ్రామంలోకి వచ్చి తమను గుర్తింపు కార్డులు అడుగుతున్నారని.. మీ గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు చూపించలేదు. పోలీసుల అణిచివేతలను ఇతర పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అమరావతి గొప్పతనం దేశమంతా తెలిసేలా రైతుల ఉద్యమం జరిగిందని..అంతిమ విజయం రైతులను వరించబోతోందని టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేశారు.
అమరావతి రైతులపై ఇంత నిర్బంధ కాండ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. రైతులు మహా అయితే ర్యాలీలు నిర్వహించి.. తరవాత అమరావతికి మద్దతుగా ప్రసంగాలు చేసి.. వెళ్లిపోయారు. ఈరోజుకు ఉద్యమం ముగిసిందనుకునేవారు. కానీ పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు పెట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని సృష్టించారు. దీంతో అమరావతి రైతుల ఉద్యమమే రోజంతా హైలెట్ అయింది.