ప్రపంచంలో అన్ని చోట్లా తమ భూములు తీసుకోవద్దని రైతులు పోరాటాలు చేస్తూంటారు. కానీ ఒక్క ఏపీలో స్వచ్చందంగా భూమూలు ఇస్తే రోడ్డున పడేశారని ఆందోళనలు చేస్తున్నారు. రోజులు కాదు.. వారాలు కాదు… నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. ఇవాళ్టికి అమరావతి రైతుల ఉద్యమానికి 600రోజులయ్యాయి. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. వారు కన్నీటిని తుడిచే నిర్ణయమే లేదు.
600 రోజులుగా అమరావతి రైతుల ఆక్రందనలు..!
దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. అమరావతిలోనూ కట్టేస్తానంటూ సీఎం జగన్ 600 రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ఉద్దేశం ఏమిటో కానీ పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో మాత్రం అది అణుబాంబు. అప్పట్నుంచి ఆ రైతులపై కమ్మవాళ్లని ముద్ర వేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. తమను అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. కానీ ఎవరికీ పట్టడం లేదు. చట్టాలను.. రాజ్యాంగాలను.. న్యాయస్థానాల కళ్లు గప్పి సైతం… రాజధాని తరలించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే అందరూ సమర్థించేవారుగా..!
అమరావతికి వ్యతిరేకం.. తాము అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తామని ప్రకటించి ఎన్నికల్లో గెలిచి ఉంటే .. ఇప్పుడు రాజధాని తరలింపుపై ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ అసెంబ్లీలో అమరావతికి మద్దతు ప్రకటించార. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పారు. రాజధాని మార్చనే మార్చబోమని చెప్పారు. కానీ అధికారం చేతికందిన తర్వాత అడ్డగోలుగా మోసం చేశారు. అందుకే రైతుల కడుపు మండిపోతోంది. ఘోరంగా మోసపోయామని కన్నీరు పెట్టుకున్నారు. రోడ్డెక్కి ఆరు వందల రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
“రైతు ఏడ్చిన రాజ్యం”లా ఏపీ పరిస్థితి..!
రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుర్భర పరిస్థితికి చేరింది. ఎక్కడికక్కడ కూల్చివేతలే తప్ప నిర్మాణాలు లేవు. రోడ్డు మీద గుంతలు కూడా పూడ్చలేనంత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం పడిపోయింది. పోనీ రాజధానిని అయినా మార్చారా అంటే అదీ లేదు. ఆరు వందల రోజుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ రాజధాని కేసుల లాయర్లకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. భూములిచ్చిన వారికి పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగ సాగుతున్న ఉద్యమం మరొకటి లేదు. అయిన పాలకుల్లో మార్పు రాలేదు.