రస్ అల్ ఖైమా అనే చిన్న దేశంతో ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారు నిర్వహిచిన లావాదేవీలు సీబీఐ కేసుల వరకూ వెళ్లాయి. ఇప్పుడీ వివాద పరిష్కారానికి అధికారులు లండన్‌కు వెళ్తున్నారు. ఆ సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. రూ. ఆరు వందల కోట్ల పరిహారం కోసం డిమాండ్ చేస్తోంది. ఈ కేసు విచారణలో తమ వాదనలు వినిపించడానికి ఏపీ ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపాలని నిర్ణయించింది.గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో బృందం లండన్ వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు బాక్సైట్ అనుమతుల్ని రద్దు చేశాయి. తమకు నష్టం వచ్చిందని రాకియా అంతర్జాతీయ వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించింది. నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన సంస్థలు రస్ అల్ ఖైమా నుంచి పెట్టుబడులు తీసుకున్నాయి. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు. ఇవన్నీ క్విడ్ ప్రో కో అని సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. రెండేళ్ల కిందట నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనపై ఇంటర్ పోల్ నోటీసు జారీ చేయించిన రస్ అల్ ఖైమా అరెస్ట్ చేయించింది.
బాక్సైట్ ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినందుకు గాను తమకు రూ. ఆరు వందల కోట్ల పరిహారం ఇవ్వాలని అన్ రాక్ డిమాండ్ చేస్తోంది. అయితే ఒరిస్సా నుంచి బాక్సైట్ సరఫరాకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం బాక్సైట్ సరఫరాకు అనుమతి ఇచ్చిందో లేదో స్పష్టత లేదు. అలాగే రస్ అల్ ఖైమా కూడా బాక్సైట్ సరఫరాకు అంగీకరించిందో లేదో స్పష్టత లేదు.
అన్‌రాక్, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్ సరఫరా వివాదం పరిష్కారానికి గతంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది. జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా… ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. ఒక వేళ రస్ అల్ ఖైమా మళ్లీ బాక్సైట్ వ్యాపారం గురించి ఆలోచించడానికి సిద్ధపడకపోతే ఆర్బిట్రేషన్ ప్రక్రియలో భాగంగా నష్టపరిహారంగా దాదాపు 600 కోట్ల రూపాయల మేర రస్ అల్ ఖైమాకు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే తీర్పు వస్తే ప్రజాధనం చెల్లించాల్సిందే.