అమ్మ ఒడి పథకానికి రూ.6,450 కోట్లు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని… ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నప్పటికీ.. తల్లికి మాత్రమే పథకాన్ని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాము తల్లికి మాత్రమే అమ్మఒడి పథకం హామీ ఇచ్చామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ పథకం పథకం కింద ఏటా రూ. 15 వేలు ఇవ్వనున్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవారికే అమ్మఒడి వర్తింప చేస్తారు. ఈ మొత్తం ఒకే సారి ఇస్తారా.. రైతు భరోసా ఇచ్చినట్లుగా విడతల వారీగా ఇస్తారా అన్నదానిపై మంత్రి సూటిగా సమాధానం ఇవ్వలేదు. కేబినెట్లో మరికొన్ని రద్దు నిర్ణయాలు తీసుకున్నారు. జగ్గయ్యపేట మం. జయంతిపురంలో బాలకృష్ణ వియ్యంకుడికి.. కేటాయించిన 498.3 ఎకరాల భూకేటాయింపును రద్దు చేశారు.
కొద్ది రోజుల క్రితం.. మంత్రి బొత్స ఈ భూములపై విమర్శలు చేశారు. అయితే..అవి తమకు స్వాధీనం చేయలేదని.. ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని.. బాలకృష్ణ అల్లుడు భరత్ స్పష్టం చేశారు. ఇప్పుడు వాటి కేటాయింపును రద్దు చేశారు. అలాగే విశాఖలో లులూ గ్రూప్‌కు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దు చేశారు. అత్యంత భారీ మాల్ నిర్మాణానికి లూలూ గ్రూప్ శంకుస్థాపన చేసింది. ఇప్పుడు.. భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రూ.20 వేలలోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లింపు, మత్స్యకారులకు ఆర్థికసాయం, డీజిల్‌పై సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకుంది.
ఇసుక వారోత్సవాలపై కేబినెట్ లో పెద్దగా చర్చ జరగలేదు. కేబినెట్ భేటీ తర్వాత.. మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు.. ఇసుక వారోత్సవాలంటే..ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే.. దీనిపై తామింకా చర్చించలేదని… తర్వాత చెబుతామని.. పెద్దిరెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రజాసేవ చేసేవారికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రభుత్వం ప్రకటించనుంది. అవార్డులతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఏడాదికి వంద మందికి ఈ బహుమతులు ఇస్తారు. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.