రేపు సాయంత్రం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన రాజకీయ శత్రువు, బద్ద విరోధి అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు.
దీనిపై వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు స్పందిస్తూ, కేసీఆర్ ని ఆహ్వానించినట్లే చంద్రబాబు నాయుడు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఆహ్వానించి ఉండి ఉంటే బాగుండేది. కేసీఆర్ ని ఏవిధంగా అపాయింట్ మెంటు తీసుకొని కలిసారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకొనివచ్చి స్వయంగా పిలిస్తే మర్యాదగా ఉండేది. అయినా మా పార్టీ ప్రాధాన్యతలు మాకుంటాయి కనుక ఒకవేళ మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వచ్చినట్లయితే ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెడతారా?” అని అన్నారు.
జగన్ స్వయంగా “నేను ఆ కార్యక్రమానికి పిలిచినా రాను. కనుక నన్ను పిలవద్దు,” అని చంద్రబాబు నాయుడుకి లిఖితపూర్వకంగా బహిరంగ లేఖ వ్రాసి మళ్ళీ ఇప్పుడు “కేసీఆర్ నిపిలిచినట్లే చంద్రబాబు నాయుడు జగన్ అపాయిట్ మెంట్ తీసుకొని స్వయంగా వచ్చి పిలవచ్చు కదా?” అని అడగడంతో మరింత నవ్వులపాలవుతున్నారు. తన ఇంటికి వచ్చిన మంత్రులని చాలా అగౌరవంగా వెనక్కి తిప్పి పంపేసి ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి పిలవాలని అడగడం చాలా హాస్యాస్పదం. అయినా ఒక ముఖ్యమంత్రి తన స్థాయికి సమానమయిన లేదా తనకంటే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తులను స్వయంగా వెళ్లి ఆహ్వానించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులని, గవర్నర్, తెలంగాణా ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయసుకూడా లేని జగన్మోహన్ రెడ్డి హుందాగా, గౌరవంగా వ్యవహరించి ఉండే బహుశః చంద్రబాబు నాయుడు ప్రోటో కాల్ పక్కనబెట్టి అందుకు సమ్మతించి ఉండేవారేమో? కానీ జగన్ ప్రవర్తిస్తున్న తీరు చూసి వైకాపా నేతలే సమర్ధించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మెట్టు దిగాలి?
“జగన్ వస్తే ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెడతారా?” అని ఉమ్మారెడ్డి వంటి సీనియర్ నేత చిన్న పిల్లాడిలా ప్రశ్నించడం చూస్తే చాలా నవ్వు వస్తోంది. రాష్ట్ర మంత్రులు తన ఇంటికి పిలవడానికి వస్తే వారు తన స్థాయికి సరిపోరని అహం ప్రదర్శించి జగన్ తిప్పి పంపేసారు. ముఖ్యమంత్రి వచ్చి పిలిస్తేనే తన స్థాయికి తగ్గట్లుగా గౌరవంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు ఉమ్మారెడ్డి మాటల ద్వారా అర్ధం అవుతోంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి తమ స్థాయికి సరిపోడని భావించవచ్చు కదా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. చంద్రబాబు నాయుడుపై నిత్యం నోరు పారేసుకొనే జగన్ పట్ల ఆయన మాత్రం ఎందుకు గౌరవంగా ప్రవర్తించాలి? అసలు ఆయనకు ఆ అవసరం ఏమిటి? అని వైకాపా నేతలు ఆలోచించుకోవాలి. జగన్ అభిప్రాయాన్నే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు వ్యక్తపరుస్తున్నట్లయితే జగన్ “ఇగో ప్రాబ్లెం”తో బాధపడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. అయినా పిలిచినా రానని గొప్పగా చెప్పుకొన్న తరువాత ఇంటికి వచ్చిన వారిని వెళ్ళగొట్టి మళ్ళీ పిలుపుల కోసం ఆశగా ఎదురు చూడటం ఎందుకో? జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత వస్తుందో..ఏమో?