ఓ ఇల్లు కడితే ఎంత అవుతుంది..?
సామాన్యుడు డబుల్ బెడ్ రూం ఇల్లుని లగ్జరీగా కట్టుకుంటే రూ. 50 లక్షలు అవుతుంది. ధనవంతుడు విల్లాలా కట్టుకుంటే.. రెండు, మూడు కోట్లు అవుతుంది. కుబేరుడు వంద కోట్లు పెట్టి అయినా ఇల్లు కట్టుకోవచ్చు.
ఎంత కట్టుకున్నా.. ఒక్క కరెంట్ పనుల కోసమే… కోట్లకు కోట్లు ఖర్చు పెట్టరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీవీఐపీ ఇళ్లలో ఖర్చుల కోసం అంటూ.. ఏకంగా రూ. ఆరు కోట్ల పదమూడు లక్షలు విడుదల చేసింది. చేయమని కాదు.. చేసేశారని.. డబ్బులు చెల్లించారు. గత మూడు నెలల కాలంలో వీవీఐపీ భవనాలు, వీవీఐపీ ఏరియాల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రో-మెకానికల్ పనులకు సంబంధించి రూ.6.13 కోట్లకుపైనే బిల్లులు చెల్లించేందుకు ఆర్అండ్బీ ఎలక్ట్రికల్ విభాగానికి అనుమతి ఇస్తూ జీవో 157ని విడుదల చేశారు. దీంతో… ఆ వీవీఐపీలు ఎవరు..? అసలు వీవీఐపీ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి..? అన్న చర్చ ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో క్లారిటీ లేదు. ప్రభుత్వం అమరావతి నుంచి తరలించాలనుకుంటోంది. గత ప్రభుత్వం కట్టిన క్వార్టర్స్ అందుబాటులోకి రాలేదు. ఒక్క సీఎం మాత్రమే సొంత ఇంటిలో ఉంటున్నారు. మంత్రులు సహా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా.. అందరికీ.. అద్దె భవనాలను క్వార్టర్లుగా కేటాయించి… అద్దె ప్రభుత్వం భరిస్తోంది. అద్దె భవనాలకు… ఇలా కోట్లు పెట్టి… ఎలక్ట్రికల్ పనులు చేయించరు. మరి వీవీఐపీ ఏరియా ఎక్కడ ఉంది..? ఎ వీవీఐపీ భవనాల్లో ఎలక్ట్రికల్ పనులు చేశారనేది.. మిస్టరీగా మారింది. గవర్నర్ నివాసం రాజ్‌భవన్ వీవీఐపీ భవనం కేటగిరీలోకి వస్తుంది. కానీ.. రాజ్‌భవన్‌లో చేపట్టే పనులు, వాటికి నిధు లు కేటాయిస్తే రహస్యంగా ఉంచరు.
పారదర్శకతే తమ విధానమని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ.. జీవోల్లో మాత్రం అది కనిపించడం లేదు. ప్రజాధనం రూ. ఆరు కోట్లకుపైగా ఖర్చు పెట్టి.. ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియకుండా నిధుల మంజూరుకు జీవోలిస్తే.. ప్రజలకు అనేక సందేహాలు.. అనుమానాలు వస్తాయి. అవి ఊహాగానాలకు దారి తీస్తాయి. వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అసలు వీవీఐపీ కేటగిరిలోకి ఎవరు వస్తారు..? ఆ వీవీఐపీ ఏరియాల్లో ఉంటున్న వీవీఐపీలు ఎవరు..? వీటన్నింటిపై వివరణ ఇస్తేనే… ప్రజలకు తెలుస్తుంది. లేకపోతే.. పరిపరివిధాలుగా అనుకునే ప్రమాదం ఉంది.
అయితే.. ఈ వీవీఐపీ ముఖ్యమంత్రి కాదని మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే.. సీఎంకు చెందిన తాడేపల్లి ఇంటికి గతంలో రూ.3.63 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ పనులు, భవనం వార్షిక నిర్వహణకు రూ.1.20 కోట్లు, అల్యూమినియం కిటీకీల ఏర్పాటుకు రూ.73 లక్షలు మంజూరయ్యాయి. కానీ తర్వాత రాజధానిని తరలించాలని నిర్ణయం తీసుకునే ముందుగానే ఆ జీవోలను రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఎవరి ఇళ్లకు ఈ మొత్తం ఖర్చు చేశారన్నది క్లారిటీ రావాల్సి ఉంది..!