ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి.. జరుగుతున్న ప్రమాదాలతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు నీటిలో కలిసిపోతుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొని నాటు పడవ బోల్తా పడింది. నాటు పడవలో 40 మంది వరకూ ఉన్నారు. వీరిలో 33 మందిని కాపాడారు. కానీ ఏడుగురు గల్లంతయ్యారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. వారిని గుర్తించలేకపోయారు. ఈ రోజు వారి కోసం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.
గల్లంతయిన వారంతా.. బాలికలే. ఆరు నుంచి పదో తరగతి వరకు చదవుతున్నవారు. అంతా పశువులలంక పాఠశాలలోనే చదువుతున్నారు. లంక గ్రామాలకు రాకపోకలకు నాటు పడవలే ఆధారం. ఆ గ్రామాల వ్యధను తీర్చడానికి అక్కడ వంతెన నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఆ వంతెన కోసం కడుతున్న పిల్లర్లే… చిన్నారుల పాలిట శాపంగా మారాయి. చిన్నారుల కోసం గాలింపు చర్యలను ఉదయమే ముమ్మరం చేస్తారు. విశాఖ నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా పిలిపించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో… గాలింపు చర్యలు కష్టంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌కు ఈ బోటు ప్రమాదాల గండం ఏర్పడినట్లుగా.. పరిస్థితులు ఉన్నాయి. నెలల వ్యవధిలోనే వరుసగా మూడు భారీ బోటు ప్రమాదాలు జరిగి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది నవంబర్‌లో బోటు బోల్తా పడటంతో.. కృష్ణానదిలో పదహారు మంది ప్రాణాలు కలసిపోయాయి. ఆ తర్వాత మేలో…గోదావరిలో దేవీపట్నం దగ్గర లాంచీ బోల్తా పడింది. అక్కడ కూడా రెండు అంకెల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. రెండు ఘటనల తర్వాత ప్రభుత్వం అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా.. లంక గ్రామాల ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా ఉండే.. నాటు పడవల్ని మాత్రం .. నియంత్రించలేకపోయారు. ఫలితంగా మరో ప్రమాదం జరిగింది. నూరేళ్ల జీవితాన్ని చిన్నారు… పదేళ్లకే గోదావరికి సమర్పించుకోవాల్సి వచ్చింది.