ఏ సినిమా లెక్క అయినా బడ్జెట్ దగ్గరే తలకిందులవుతుంటుంది. ఓ అంకె చెప్పుకొని సినిమా మొదలెడతారు. చివరికొచ్చేసరికి ఆ అంకె దాటిపోయి కళ్లు తేలేస్తారు. ఓవర్ బడ్జెట్ వల్ల డింకీలు కొట్టిన సినిమాలెన్నో. హిట్ అనిపించుకొని కూడా నష్టాల బాట పట్టడానికి కారణం హెవీ బడ్జెట్టే. అందుకే ఆ విషయంలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓ సినిమాకి ముందే `ఇంతలో తీద్దాం` అనుకొని ప్రయాణం చేయాల్సిందే. ఈ అంకె చెప్పినప్పుడు ప్రొడ్యసర్స్ ని, హీరో మార్కెట్‌నీ దృష్టిలో ఉంచుకొని.. బడ్జెట్ వేస్తారు దర్శకులు. కానీ సుకుమార్ మాత్రం తన కథకు ఎంత కావాలో అంత అంకె వేసుకొన్నారు. దాంతో ఇప్పుడు చరణ్ కంగారు పడుతున్నాడు.
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కథ కూడా దాదాపు లాక్ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ లెక్కలూ వేసేసేశారట. ఈసినిమాకి దాదాపుగా రూ.70 కోట్ల వరకూ ఖర్చువుతుందని సుకుమార్ తేల్చాడు. ఈ అంకె చూసి రామ్‌చరణ్ కళ్లు తేలేశాడట. ఇది మగధీర బడ్జెట్‌తో సమానం. మగధీరలో గ్రాఫిక్స్ హడావుడి ఎక్కువగా ఉంది కాబట్టి, అది రాజమౌళి సినిమా కాబట్టి గట్టెక్కేసింది. అవేం లేకుండానే సుకుమార్ ఇంత చెప్పేసరికి రామ్‌చరణ్ అవాక్కయ్యాడట. అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉందని సుక్కు సర్ది చెబుతున్నాడట. సినిమా హిట్టయితే వంద కోట్లు కొట్టడం ఖాయమంటున్నాడట. సుక్కు విజువల్ సెన్స్‌పై నమ్మకం ఉన్న నిర్మాతలు పచ్చజెండా ఊపేసినా.. ”బడ్జెట్‌కి కాస్త తగ్గించే ఛాన్సుందా..” అంటూ చరణ్ సుక్కుని అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరి సుక్కు ఎంత రిబేట్ ఇస్తాడో చూడాలి.