మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యాపం) కుంభకోణంలో నిందితులుగాఆరోపించబడి గౌలియర్ సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ (విచారణ) ఖైదీలుగా ఉన్న 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తమ ఆవేదనను ఒక లేఖ రూపంలో రాష్ట్రపతికి తెలియజేసినట్టు వార్తలొస్తున్నాయి. జైలు అధికారులు లేఖ విషయం ధృవీకరించకపోయినా మీడియాలో మాత్రం ఆధారాలతోసహా వార్తలొస్తున్నాయి.
అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్న తమకు బెయిలైనా ఇప్పంచండి, లేదా ఆత్మహత్యచేసుకోవడానికి అనుమతైనా ఇవ్వండంటూ వీరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. 2010లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన ఐదుగురు విద్యార్థులు కూడా కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతికి లేఖ రాస్తూ, ఇదే విషయం తెలియజేశారు. వ్యాపం కుంభకోణం కేసును సీబీఐ తీసుకోవడానికి ముందు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణచేసింది. అయితే, సిట్ తమతప్పులేదని చెప్పినా ఇంకా తమకు ఈ జైలుజీవితమేమిటని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యం మరోపక్క తమను వేధింపులకు గురిచేస్తున్నదని కూడా వీరు ఆలేఖలో ప్రస్తావించారు.
ఇక ఇప్పుడు గౌలియర్ జైల్లో విచారణఖైదీలుగా ఉన్న 70 మంది విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు అదే బాటతొక్కుతూ, తమకు బెయిలైనా ప్రసాదించాలనీ, లేదా ఆత్మహత్యచేసుకోవడానికైనా అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖరాయడం సంచలనం సృష్టిస్తోంది. వీళ్లంతా కొన్నినెలలుగా విచారణఖైదీలుగా ఉంటున్నారు. వ్యాపం ఉద్యోగులు, అధికారుల అవకతవకలకు తమను బాధ్యులను చేశారని వీరు ఆలేఖలో ఆరోపించారు. నెలల తరబడి జైల్లో ఉంటున్నా, విచారణ ముగుస్తుందన్న ఆశారేఖలు కనిపించడంలేదని వారు వాపోయారు. సామాజికంగా, మానసికంగా తాముక్రుంగిపోయామనీ, అందుకే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామని అంటున్నారు.
తమను అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చే సమయానికి తాము అనేక ఆస్పత్రిల్లో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నామనీ, ఉన్నట్టుండి జైలుపాలుకావడంతో తమ కుటుంబపరిస్థితి అధ్వాన్నంగా తయారైందని మెడికల్ విద్యార్థులు చెబుతున్నారు. భోపాల్, జబల్పూర్ జైళ్లలోని ఇదే కేసు నిందితులను బెయిల్ పై విడుదల చేసినప్పుడు తమ పరిస్థితి ఎందుకిలా అయిందని వారు రాష్ట్రపతికి రాసినలేఖలో ప్రశ్నించారు.
ఇప్పటికే 40మంది వ్యాపంకేసుతో లింకులున్నవారు అనుమానస్పదంగా మరణించారు. కాగా, 2013లో వ్యాపం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటినుంచీ రెండువేలకు పైగానే అరెస్టులయ్యాయి. వ్యాపం కుంభకోణంలో రాజకీయ పెద్దలు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వృత్తిపరమైన ఉద్యోగాలు, కోర్సులకు సంబంధించిన ప్రవేశపరీక్ష నిర్వహించే బోర్డులో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో వ్యాపం కుంభకోణం వెలుగుచూసింది.