ఆంధ్రప్రదేశ్ సర్కార్ వినూత్నమైన ఆలోచన చేస్తోంది. విద్యా ప్రమాణాలు పెంపు కోసం.. ఏపీలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల్లో దాదాపుగా 70 శాతం మూసివేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యపై.. జగన్ అధికారంలోకి రాగానే ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ రెండు రోజుల కిందట నివేదిక ఇచ్చింది. ఇందులో.. ఏపీలో ఉన్న 287 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 200 కాలేజీలు వేస్ట్ అని తేల్చారు. వాటన్నింటినీ మూసేయాలని సిఫార్సు చేశారు. అడ్మిషన్లు ఉండవని.. క్లాసులు జరగవని.. సరైన అధ్యాపక సిబ్బంది ఉండరని.. ఈ కాలేజీల వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని అందులోతేల్చారు. అంటే…ఏపీలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ఓ 30 ఇంజినీరింగ్ కాలేజీలు మినహా.. ప్రైవేటు కాలేజీలు కేవలం 87 మాత్రమే.. నడపడానికి అర్హమైనవని.. మిగతావన్నీ మూసేయవచ్చని.. నేరుగా.. ఆ కమిటీ సిఫార్సు చేసినట్లయింది.
ప్రభుత్వ కాలేజీల్లోనే మెరుగైన ఫలితాలొస్తున్నాయని కూడా.. ఆ కమిటీ విశ్లేషించింది. డిగ్రీకాలేజీలు అంశంపై విశ్లేషణ చేసినప్పటికీ.. అసలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలను ఏకంగా 200 వరకూ మూసివేయమని నేరుగా సిఫార్సు చేసింది. వైఎస్ హయాంలో.. ఇబ్బడి మబ్బడిగా ఇంజినీరింగ్ కాలేజీకు అనుమతులు ఇచ్చారు. వాటిల్లో ఆడ్మిషన్లు లేకపోయినప్పటికీ.. వైఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దాంతో.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఆయా కాలేజీలకు చేరడంతో.. మరిన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు.. ఫీజు రీఎంబర్స్మెంట్కు ఆంక్షలు పెట్టాయి. ఈ ఆంక్షల్నే.. తప్పు పట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే… అందరికీ విద్య ఉచితమని ప్రకటించారు. వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు .. ఏడాదికి రూ. 20వేల వరకూ.. ఇతర ఖర్చుల కోసం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ స్కీమ్ ఇంకా అమలు చేయడం ప్రారంభం కాలేదు.
అయితే కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇంజినీరింగ్ కాలేజీలను.. మూసివేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల ప్రమాణాలపై దేశవ్యాప్తంగా.. నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది. సరైన ఇంగ్లిష్ కూడా రాకుండా.. ఇంజినీరింగ్ పట్టభద్రులై.. ఉద్యోగాల కోసం వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొన్ని ప్రముఖ కాలేజీల్లో చదివిన వారిని మాత్రమే… గుర్తించడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఆ చెడ్డపేరు పోగొట్టాలంటే ప్రమాణాలు పెంచడమే మంచిదని.. జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు..ఇంజినీరింగ్ కాలేజీలకు కోత వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.