తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనడానికి పెద్దగా ఉత్సాహం చూపించ లేదు. మొత్తంగా.. 70 శాతానికి అటూ ఇటుగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 68.5 శాతం ఓటింగ్ నమోదయింది. ఐదు గంటల వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం.. చాలా తక్కువగా ఉంది. యాభై శాతానికి అటూ ఇటుగా ఉండనుంది. ప్రతీ సారి గ్రేటర్ లో .. యాభై శాతానికి అటూ ఇటుా మాత్రమే ఓటింగ్ శాతం జరుగుతుంది. నగర పరిధిలో ఓటర్లు మొదటి నుంచి ఓటు విషయంలో లైట్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ సారి అభ్యర్థులు ఎంత చురుకుగా ప్రచారాన్ని నిర్వహించినా… పోలింగ్ శాతం మాత్రం యథావిధిగానే ఉంది.
అయితే గ్రేటర్ ఎన్నికలతో పోలిస్తే. దాదాపుగా మెరుగుపడినట్లే చెప్పుకోవాలి. గ్రేటర్ లో పోలింగ్ బాగా తక్కువ నమోదవడానికి పాతబస్తీలోని నియోజకవర్గాలే కారణం. ఎంఐఎం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతానికి గొద్దిగా ఎక్కువ పోలింగ్ జరిగింది. శుక్రవారం కావడంతో.. ముస్లింలు ఎక్కువగా ప్రార్థనలకే ప్రాధాన్యం ఇచ్చారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 42శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. చెదురుమదురు ఘటనలు మినహా.. ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే.. చాలా చోట్ల ఓట్ల గల్లంతు ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో వందల ఓట్లు గల్లంతయ్యాయి.
ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ… అసలు జాబితాకు.. ఏజెంట్లకు ఇచ్చిన జాబితాకు తేడా ఉండటంతో ఓటు లేదని చెప్పి పంపించేశారు. ఇలా కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓట్లు వేయలేకపోయారు. ఐపీఎస్ ఆఫీసర్ టీ కృష్ణప్రసాద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల లాంటి సెలబ్రిటీలు కూడా.. ఇలా ఓటు మిస్సయిన వారి జాబితాలో ఉన్నారు. మంత్రి ఈటల రాజెందర్ కుటుంబీల పేర్లు కూడా ఓటర్ జాబితాలో గల్లంతయ్యాయి. పోలింగ్ ముగియడంతో.. అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ సరళిని విశ్లేషించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఫలితాలపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయి ఓటింగ్ శాతాలను.. రేపు ఉదయానికి అన్ని వివరాలు వచ్చిన తర్వాత ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.