అమరావతి రైతులు న్యాయం కోసం ప్రారంభించిన ఉద్యమం 700 రోజులకు చేరుకుంది. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని ఆహ్వానించి… అమరావతే రాజధాని అని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి చివరికి గెలిచాక రైతుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వ పెద్దల నిర్వాకానికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు. భూములు ఇచ్చి మరీ రోడ్డున పడ్డా.. మొక్కవోని పట్టుదలతో పోరాడుతున్నారు. కరోనాలు.. ప్రభుత్వ నిర్బంధాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు తమ త్యాగాలను వివరించి మద్దతు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమరావతి రైతులపై కులం ముద్ర వేశారు. మతం ముద్ర వేశారు. ప్రాంతం ముద్ర వేశారు. రాజధాని 29 గ్రామాల సమస్య అన్నారు. ఇంకా ఏమేమో అంటున్నారు. పాలకులు ఎక్కడైనా కనీస బాధ్యతతో ఉంటారు. ప్రజల పట్ల.. రాష్ట్ర ఉన్నతి పట్ల కొంతైనా బాధ్యతతో ఉంటారు. కానీ ఏపీలో అవేమీ ఉండవు. ప్రజల్ని.. రాష్ట్రాన్ని పాతాళంలోకి తొక్కేసినా ఎలాంటి సమస్య లేదనుకుంటారు. అలాంటి ఆలోచనలతో ఉన్న పాలకులతో రైతులు పోరాడుతున్నారు. తమపై ఎన్ని ముద్రలు వేసినా.. తమకు న్యాయం జరిగితే రాష్ట్రం బాగుపడుతుందని పోరాడుతున్నారు.
వారి పోరాటం ఫలిస్తోంది. ఇంత కాలం అమరావతి రైతుల సమస్యే అనుకున్నారు. ఎవరూ మద్దతు తెలియచేయడం లేదు.. ప్రభుత్వానికి భయపడుతున్నారు అనుకున్నారు ..కానీ ప్రజల్లో రాజధాని పట్ల మమకారం ఉందని పాదయాత్ర ద్వారా తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ఆంక్షలు పెట్టాలనుకున్న పోలీసులు కూడా చివరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రజలు కూడా రాజధాని ఉంటే అందరి బతుకులు బాగుపడతాయని.. పిల్లలకు మంచి భవిష్యత్ వస్తుందని నమ్ముతున్నారు. అందుకే వారందరి కళ్లకు రాజకీయాల కోసం అధికార పార్టీ కప్పిన కుల, మత, ప్రాంత మబ్బులను వీడిపోయేలా చేసుకుంటున్నారు. ఈ చైతన్యం ఇలా సాగితే త్వరలోనే అమరావతి రైతుల ఉద్యమం నలు దిక్కులా వ్యాపిస్తుంది. అప్పుడు ఎవరూ ఆపలేరు.