గుజరాత్‌లోని ముంద్రా పోర్టు నుంచి దేశంలో రూ. 70వేల కోట్లకుపైగా విలువైన హెరాయిన్ దేశంలోకి ప్రవేశించింది. ఈ విషయం ఆధారాలతో సహా స్పష్టమయింది. ఓ రూ. తొమ్మిది వేల కోట్ల హెరాయిన్‌ను పట్టుకున్నారు. మిగతా అంతా ఇండియాలోకి వచ్చింది. వాటిని అక్కడి ప్రజలకు అమ్మారా లేకపోతే మరో పోర్టు నుంచి విదేశాలకు తరలించారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ దర్యాప్తు ఏమయిందని.. పోలీసులు ఎంత సిన్సియర్‌గా పని చేశారన్నది తర్వాతవిషయం. మీడయా కూడా వారు ఇచ్చినంత ప్రాధాన్యతే ఇచ్చింది. నిజానికి అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడితే కింగ్ పిన్ను పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ పట్టుకోలేదు. అసలు మీడియా కూడా ఈ విషయంలో లైట్ తీసుకుంది.
కానీ అదే షారుఖ్ ఖాన్ కుమారుడు పార్టీలో పాల్గొని కొకైన్ తీసుకున్నాడని వెంటనే మాటు వేసి పట్టుకున్నారు. మీడియాకు ఏ టు జడ్ వివరాలు చెప్పి పరువు తీశారు. ఇక మీడియా ఇతర పనులను ప్రారంభించారు. రూ. 70వేల కోట్ల హెరాయిన్ కు దక్కని ప్రాధాన్యం రూ. లక్ష కొకైన్కు ఇస్తున్నారు. నిన్న ఉదయం నుంచి చెప్పిందే చెబుతున్నారు. దేశం ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉందో అన్న విశ్లేషణలు చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ కుమారుడిని డ్రగ్స్ కేసులో పట్టుకునేందుకు చాలా రోజులుగా ప్లాన్ చేశారని కూడాతేలిపోయింది. పదిహేను రోజులుగా వారు చేసుకోబోయే పార్టీ మీద సమాచారం సేకరించి ప్లాన్డ్గా పట్టేసుకున్నారు. అసలు ఆ పార్టీకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి.. అనే మూలాల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు కానీ.. వాడుతూ పట్టుబడిన వారిని మాత్రం ఇలా అందరి ముందు దోషలుగా నిలబెట్టేశారు. అలా చేయడంలో తప్పు లేదు కానీ.. మూలాల్ని వెదక్కుండా ఇలా టార్గెటెడ్‌గా కొద్ది మందిని మాత్రమే హైలెట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు.
దేశానికి అతి పెద్ద ముప్పుగా డ్రగ్స్ మారుతున్నాయి. ఈ విషయం ఇలా బయటపడుతున్న రేవ్ పార్టీలతోనే వెల్లడవుతోంది. ఎక్కడ చూసినా గంజాయి సరఫరా అవుతోంది. డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. సమస్య మూలాల్ని.. డ్రగ్స్ డాన్లను బయటకు తీసుకు రావాలి కానీ..వాటికి బానిసయ్యేవారినే నిందితులుగా చూపించడం వల్ల ప్రయోజనం ఉండదు.