ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో.. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ ఓ చట్టం చేసింది. దాని ప్రకారం ఏపీలో ఎవరు ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలన్నా.. అందులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలి. ఆ చట్టం అమల్లోకి వచ్చేసింది కూడా. ఆ తర్వాత పరిశ్రమలు ఏమీ రాలేదు కాబట్టి.. అలాంటి నియామకాల గురించి ఇంకా చర్చ జరగడం లేదు. అయితే.. హఠాత్తుగా.. ఓ న్యాయవాది.. ఏపీ సర్కార్ చేసిన ఆ చట్టానికి చట్టబద్ధత లేదంటూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఆమెకు పిటిషన్ వేసే అర్హత లేదని.. దాన్ని విచారించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగాలు ఇవ్వలేమని ఎవరైనా పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తే.. ఆ మేరకు వారు కోర్టుకు వెళ్లాలి కానీ ఇతరులు పిటిషన్లు వేయడం సరి కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే పిటఇషన్లో ప్రజాప్రయోజనం కూడా ఇమిడి ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించింది. రాజ్యాంగానికి లోబడే ఈ నిర్ణయం తీసుకుందా? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. నెల రోజుల సమయాన్ని హైకోర్టు ఇచ్చింది.
75 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న చట్టం .. రాజ్యాంగ వ్యతిరేకమని మొదటి నుంచి చర్చ నడుస్తోంది. అప్పట్లో ఈ చట్టంపై… నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. ట్విట్టర్లో.. ఆంధ్రప్రదేశ్ నిర్ణయం బిల్లు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు.. పనిచేసుకోవచ్చని రాజ్యాంగం చెప్పిందని అనేక పత్రికల్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఏపీ సర్కార్.. ఆ చట్టం తెచ్చినప్పటి నుంచి.. జాతీయ స్థాయిలో ఎక్కువ చర్చ జరిగింది. బిల్లు వల్ల ఏపీ ఎంత తీవ్రంగా నష్టపోతుందో.. చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.