దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 48 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో చాలా భారీగా జీతాలు పెరగబోతున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెంపుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి జస్టిస్ ఏ.కె. మాధూర్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఏడవ పే కమీషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నిన్న తమ నివేదికను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి అందించారు. ఆ నివేదికలో ఉద్యోగులు అందరికీ 23.55 శాతం జీతాలు పెంచాలని సూచించారు. ఈ పెంపు ప్రస్తుతం పని చేస్తున్నవారితో బాటు ఇదివరకే పదవీ విరమణ చేసిన 55 లక్షల మంది ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్లకి కూడా వర్తింపజేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి దీనిని అమలు చేయాలని సిఫార్సు చేసారు.
ఉద్యోగుల వేతనాల పెంపుతో బాటు ఏడవ పే కమీషన్ ఇంకా అనేక ఇతర సిఫార్సులు కూడా చేసింది. ప్రభుత్వోద్యోగుల కనీస వేతనం రూ. 18, 000 ఉండాలని, గరిష్ట వేతనం నెలకు రూ.2.5లక్షల వరకు ఉండవచ్చని సిఫార్సు చేసింది. ఏడవ పే కమీషన్ తన నివేదికలో మరో ముఖ్యమయిన సిఫార్సు కూడా చేసింది. ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ కోసం చిరకాలంగా పోరాడుతున్న సైనికులకు దానిని తక్షణమే అమలు చేయాలని కోరింది. వారితో బాటు సాధారణ ప్రభుత్వోద్యోగులకు కూడా దానిని వర్తింపజేయాలని సిఫార్సు చేసింది.
ఈ ఏడవ పే కమీషన్ చేసిన తాజా సిఫార్సుల వలన కేంద్రప్రభుత్వంపై ఏడాదికి సుమారు 1.02 లక్షల కోట్లు అదనపు ఆర్ధిక భారం పడబోతోంది. దాని కోసం కేంద్ర బడ్జెట్ లో రూ. 73, 650 కోట్లు, రైల్వే బడ్జెట్ లో రూ.28, 450 కోట్లు కేటాయించవలసి ఉంటుంది. ఉద్యోగుల జీతాలను చాలా భారీగా పెంచేందుకు సిఫార్సు చేసిన ఏడవ పే కమీషన్, ప్రతీ ఏటా ఉద్యోగులకు ఇస్తున్న 3శాతం ఇంక్రిమెంటుని యధాతధంగా అమలుచేయాలని కోరింది.
ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే మూడు తరగతుల వారికి వారి వారి బేసిక్ పేలో వరుసగా 24, 16, 8 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ పెంపుకి సిఫార్స్ చేసింది. ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ 50శాతం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు, ఈ హౌస్ రెంట్ అలవెన్సులని కూడా ఉద్యోగుల తరగతులను బట్టి వరుసగా 27,18,9 శాతాలు పెంచాలని సిఫార్సు చేసింది. మళ్ళీ ఈ డియర్ నెస్ అలవెన్స్ 100 శాతం దాటినప్పుడు హౌస్ రెంట్ అలవెన్సులని కూడా ఉద్యోగుల తరగతులను బట్టి వరుసగా 30, 20, 10 శాతాలు పెంచాలని ఏడవ పే కమీషన్ సిఫార్సు చేసింది. దాని సిఫార్సులను కేంద్రప్రభుత్వం ఆమోదించడం లాంఛన ప్రాయమే గనుక త్వరలోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారిగా పెరబోతున్నాయని భావించవచ్చును. అయితే ఏడవ పే కమీషన్ సిఫార్సుల పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.