ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా బుధవారం ఓ జీవో విడుదల చేసింది. అందులో ఏముందంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర రాజకీయ నేత ఇమేజ్ ను జాతీయ స్థాయిలో పెంచేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపుతో ఒప్పందం చేసుకున్నారని దాని ప్రకారం రూ. ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు చెల్లించాలని నిర్ణయించారనేది ఆ జీవో సారాంశం. ఈ జీవోలోని అర్థం… దానికి చెల్లించే పైకం చూసి… సామాన్యులకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. సామాన్యుడుకి రూ.ఐదుకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు.. భారం అని మూసేసిన ప్రభుత్వం ఇలా… అధికార పార్టీ నేతల ఇమేజ్ బిల్డింగ్ కోసం కోట్లకు కోట్లు వెచ్చించడమే దీనికి కారణం. ఇప్పటికిప్పుడు ఏపీ అధికార పార్టీ నేతల ఇమేజ్‌కు వచ్చిన ముప్పేంటని.. దాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రజాధనం ఎందుకు వెచ్చించాలనే ప్రశ్నలూ సామాన్యుల వైపు నుంచి వస్తున్నాయి.
అనుకూల వార్తలు రాయడానికి క్విడ్ ప్రో కోనా..!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై ఇటీవలి కాలంలో జాతీయ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆయన అపరిపక్వ పరిపాలకుడిగా.. ఏ మాత్రం దక్షత లేని నాయకుడిగా మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. అయితే అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డితో దగ్గరి సంబంధాలున్నాయని.. ఆయన మీడియా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న వారు ఆయనకు పాజిటివ్‌గానే వార్తలు రాస్తున్నారు. దీంతో.. ఇలా … ఢిల్లీ మీడియా సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనాలు కల్పించి.. తమ గురించి నెగెటివ్ వార్తలు రాకుండా చూసుకునేందుకు ప్రజాధనాన్ని ఇలా పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో ధర ఎంతో చెప్పకుండా ఎన్టీటీవీకి కాంట్రాక్ట్..!
ఇప్పటికే ఎన్డీటీవీకి రూ. ఆరేడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను ఏపీ సర్కార్ ఇచ్చింది. ఇంగ్లిష్ మీడియంపై ఎన్డీటీవీ సంస్థ స్టేట్ లెవల్ సర్వే చేస్తుందని…అలాగే.. ప్రభుత్వ కార్యక్రమాలపై ఏడు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుందని ప్రభుత్వం చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసింది. ఈ సర్వేకు..ఈ షార్ట్ ఫిల్మ్స్‌కు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో జీవోలో లేదు. మొత్తంగా కోట్లతోనే ఉంటుంది. ఎన్డీటీవీకి ఈ కాంట్రాక్ట్ దక్కిన తర్వాత ప్రభుత్వ ఇమేజ్ ను బిల్డ్ చేస్తోంది. లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ అనే సర్వేను ప్రసారం చేసింది. మూడు మాస్కులు ఇచ్చేశారని గొప్పగా చెప్పింది. ఇప్పుడు టైమ్స్ఆఫ్ ఇండియాలోనూ ఇలాంటి ఇమేజ్ కోసమే.. రూ. ఎనిమిది కోట్లు వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రజాధనం అంటే సొంత ధనంగా పాలకులు భావిస్తున్నారా..?
ప్రజాధనం విషయంలో ఆంధ్రప్రదేశ్ పాలకులకు ఏ మాత్రం బాధ్యత లేకుండా పోయింది. గత పాలకులు కట్టారన్న కారణంతో రూ. పది కోట్ల విలువైన ప్రజావేదికను క్షణం ఆలోచించకుండా.. దాని కిందనే కూర్చుని కూల్చివేతలకు ఆదేశాలిచ్చిన పెద్దలు.. ఆ తర్వాత ఆ ప్రజాధనాన్ని సొంత ఇళ్లకు.. సొంత మీడియా వారికి.. సొంత మీడియాకు… సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున ధారదత్తం చేయడంలో ఎక్కడా మొహమాటపడటం లేదు. తాజాగా.. ఈ ధారదత్తంలో మరో అడుగు.. ఇంగ్లిష్ మీడియాకు పంపకాలు. ప్రజాధనానికి పాలకులు తమ సొంత ధనంగా భావించడంతోనే సమస్య వస్తోంది.