నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మందిని ప్రాణాలతో కాపాడటం దాదాపుగా అసాధ్యమన్న భావన వినిపిస్తోంది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పటికీ ఎలా రక్షించాలోవారికి అర్థం కాలేదు వారు కూడా కొంత దూరం లోపలికి వెళ్లగలిగారు. కానీ తర్వాత వెళ్లలేక వెనక్కి వచ్చేశారు. దీంతో వారిని కాపాడాలంటే.. చాలా పెద్ద ప్రయత్నమే చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టన్నెల్ బోరింగ్ మిషన్ తో పని చేయడానికి అందరూ లోపలికి వెళ్లారు. యాభై మందికి పైగా వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో పని చేస్తున్నవారు ఇరుక్కుపోయారు. మట్టిపెళ్లలు పడుతున్నాయని గుర్తించి.. బయటకు వచ్చేసిన వారు బయట పడ్డారు. కానీ ముందు భాగంలో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. అంటే ముందుగా మొత్తం మూసుకుపోయి ఉంటుంది.. మధ్యలో ముందు కూడా మూసుకుపోయింది. మధ్యలో అయినా సరిగ్గా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈ ప్రకారం చూస్తే వారిపై కూడా మట్టిపెళ్లలు పడి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
నాలుగేళ్ల పాటు నిలిచిపోయిన పనుల్ని మళ్లీ ప్రారంభించాలంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి టన్నెల్స్ నిర్మాణం నాలుగేళ్ల పాటు నిలిచిన తర్వాత పనులు చేయాలంటే.. చాలా పరీక్షలు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ కంపెనీలు మాత్రం అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేదు. అందుకే పనులు ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ప్రమాదం జరిగింది. ఇక్కడ తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే ఎనిమది కుటుంబాలకు మాత్రం తీరని వేదన మిగులుస్తున్నారు.