డిసెంబరు అంతా కొత్త సినిమాలతో టాలీవుడ్ కళకళలాడిపోనుంది. దానికి తగ్గట్టే అఖండతో మంచి బూస్టప్ వచ్చింది. డిసెంబరు 17న పుష్ఫ వస్తోంది. ఆ తరవాత శ్యాం సింగరాయ్ ఉంది. దాంతో డిసెంబరు అయిపోతుంది. ఆ వెంటనే సంక్రాంతి సీజన్ మొదలైపోతుంది. చిన్న, మీడియం సినిమాలకు ఉన్న గ్యాప్ ఈ వారం మాత్రమే. అందుకే ఏకంగా 8 సినిమాలు ఈ వారం విడుదలకు సిద్ధమయ్యాయి. వస్తున్న సినిమాలు 8 ఉన్నా, అందరి దృష్టి లక్ష్య, గమనంపైనే.
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం లక్ష్య. ఇదో స్పోర్ట్స్ డ్రామా. టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. శౌర్య 8 ప్యాక్ బాడీతో… మాస్ ని తన వైపుకు లాగేస్తున్నాడు. ఈ సినిమాతో శౌర్య ఇమేజ్ మారబోతోందని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. వరుడు కావలెనులో పక్కా క్లాస్ గా కనిపించాడు. శౌర్య. ఆ సినిమా విడుదలైన నెల రోజుల లోపే.. మాస్ టచ్‌తో రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఈవారమే గమనం వస్తోంది. శ్రియ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ప్రసిద్ధ డీఓపీ జ్ఞానశేఖర్ నిర్మాత. బుర్రా సాయిమాధవ్, ఇళయరాజా లాంటి వాళ్లు ఈ సినిమా స్టాండర్డ్ ని పెంచారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఓ ఫీల్ గుడ్ సినిమా చూడబోతున్నామన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ వారం వచ్చే సినిమాల్లో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు.
వీటితో పాటుగా మడ్డీ, నయీం డైరీస్,చ బుల్లెట్ సత్యం, కటారి కృష్ణ, మనవూరి పాండవులు, ప్రియతమా చిత్రాలు ఈవారమే రాబోతున్నాయి.