హైదరాబాద్: తెలంగాణలో టీడీపీనుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరుగుతుండగా, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఒకేసారి ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి దూకబోతున్నారని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీకి చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధమైపోయారు. జలీల్ ఖాన్ ఇవాళ కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలిసి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును విజయవాడలో ఆయన నివాసంలో కలిశారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ కూడా అక్కడే ఉన్నారు. ఆ భేటి తర్వాత దేవినేని ఉమ, జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా తెలుగుదేశంవైపు చూస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు మహా సంకల్పాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారని ఉమా చెప్పారు. అభివృద్ధి చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. పోలవరం, రాయలసీమలో హంద్రీ నీవా గాలేరు వంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. జలీల్ ఖాన్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృధ్ధి, మైనారిటీ సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిశానని, టీడీపీలో ఇంకా చేరలేదని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ముస్లిమ్‌లు ఎవరూ లేరు కాబట్టి జలీల్ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వొచ్చని అంటున్నారు.
మిగిలిన ఏడుగురు కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. వీరిలో కడప నుంచి ఇద్దరు, ప్రకాశం నుంచి ఇద్దరు, కృష్ణాజిల్లానుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఒక్కరు ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే వైసీపీకి రాష్ట్రంలో పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలాఉంటే ఈ పరిణామాలపై వైసీపీ పార్టీ సొంత మీడియా సాక్షి డేమేజ్ కంట్రోల్ ప్రారంభించింది. తాము పార్టీ మారబోవటంలేదంటూ జలీల్ ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు చెప్పినట్లు స్క్రోలింగ్ ఇస్తోంద.