మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్‌గా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏకంగా 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మోహరించబోతున్నారు. ఇంచార్జ్‌లుగా నియమితులైన వారంతా దసరా తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించింది ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని.. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇప్పటి వరకూ మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కసరత్తులో హరీష్ రావు పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు.కానీ ఇప్పుడు ఆయనకే బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది. తొలి సారిగా మునుగోడుపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు హరీష్ రావుకు పిలుపు అందింది. ఆయన కూడా హాజరయ్యారు. మునుగోడులో అంత తేలిక కాదని అర్థం కావడంతో ఉపఎన్నికల బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అప్పగించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు.
ఇటీవల దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలు హరీష్ కే ఇచ్చారు. అయితే నాగార్జున సాగర్, హుజూర్ నగర్ వంటి ఎన్నికల బాధ్యతలు ఆయనకు ఇవ్వలేదు. యాధృచ్చికంగా హరీష్ బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు సవాల్ లాంటి నియోజకవర్గంలో కూడా హరీష్‌కే బాధ్యతలిస్తున్నారు. తేడా వస్తే హరీష్‌కు మరోసారి టీఆర్ఎస్లో కష్టకాలం వస్తుందన్న గుసగుసలుకూడా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ జాతీయ పార్టీ రాజకీయాల కోణంలో ఇప్పుడీ వ్యవహారం గుసగుసలకు కారణం అవుతోంది.