మెట్రో సిటీ హైదరాబాద్ కరోనా గుప్పిట్లో చిక్కు కుంటోంది. ముంబై, ఢిల్లీ, చెన్నైలతో పోలిస్తే.. ఇప్పటి వరకూ అంతో ఇంతో ధైర్యంగా ఉన్న తెలంగాణ రాజధాని వాసులు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణలో ఒక్క రోజే 872 పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 713 గ్రేటర్ పరిధిలోనివే. టెస్టులు కూడా భారీగా ఏమీ చేయడం లేదు. ఇరవై నాలుగు గంటల్లో కేవలం 3189 టెస్టులు మాత్రమే చేశారు. ఇందులోనే 872 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. కరోనా కేసుల్లో ఇది రోజువారీ రికార్డు. ఆ మాటకొస్తే.. ప్రతీ రోజూ.. దాదాపుగా.. కొత్త కేసుల రికార్డు నమోదవుతోంది.
ఆదివారం.. ఏడు వందలకుపైగా కేసులు నమోదయితే.. సోమవారం అది.. ఎనిమిది వందలకు చేరుకుంది. ఈ వేగం ఇంకా పెరుగుతుంది కానీ.. తగ్గే పరిస్థితి లేదని.. అంచనా వేస్తున్నారు. ముంబై.. చెన్నై .. ఢిల్లీ తరహాలో.. హైదరాబాద్‌లోనూ ఫస్ట్, సెకండ్ కాంటాక్టులకు వైరస్ శరవేగంగా సోకుతున్నట్లుగా తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత హైదరాబాద్‌లో జన జీవనం సాధారణం అయింది. ఎవరూ కరోనా గురించి భయపడటం లేదు. ఆఫీసులు.. కార్యాలయాలు యధావిధిగా నడుస్తున్నాయి. మాస్క్.. శానిటైజర్లతో.. కరోనాపై గెలిచేస్తామని.. ప్రజలు అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదని.. రోజు రోజుకు పెరిగిపోతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా కేసులు ఎందుకిలా పెరుగుతున్నాయన్నదానిపై తెలంగాణ ఆరోగ్య శాఖ వర్గాలకే స్పష్టత లేకుండా పోయింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని.. ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. మరి ఇన్ని కేసులు ఎలా నమోదవుతున్నాయో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో.. లక్షణాలు లేని వారిని హోం క్వారంటైన్కే సిఫారసు చేస్తున్నారు. ఈ కేసులు ఇలా పెరిగితే.. కనీసం చికిత్స అందించే పరిస్థితి కూడా ఉండదు. అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది.