కార్తికేయ నటించిన ’90 ఎం.ఎల్’ రేపు (గురువారం) విడుదల కావాల్సివుంది. అయితే ఇంకా సెన్సార్ ఇంకా పూర్తవలేదు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు ఈ సినిమా చూస్తోంది. సినిమా పూర్తయి, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేలోగా పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే రేపు ఈ సినిమా విడుదల కానట్టే. శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
90.ఎం.ఎల్ అనే టైటిల్ అభ్యంతరకరంగా ఉందని, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని అందుకే సెన్సార్ జరగలేదని వార్తలు వినవస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి అలాంటి సమస్యేం లేదు. ఈ సినిమా ఆగిపోవడానికి మాత్రం ప్రధాన కారణం.. రాంగోపాల్ వర్మ తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.
సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటుంటారు. ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆ క్రమంలోనే సెన్సారు బోర్డు సినిమా చూడాలి. కాకపోతే… ఎవరి సినిమా ముందుగా విడుదలకు ఉంటుందో, వాళ్ల సినిమాని సెన్సార్ చేయడం ఓ అలవాటుగా వస్తోంది. చివరి నిమిషాల్లో విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చిన సినిమాలు… సెన్సార్ కోసం వస్తుంటాయి. వాళ్ల అవసరాల రీత్యా.. వరుస క్రమంలో వచ్చిన సినిమాల్ని పక్కన పెట్టి మరీ సెన్సార్ చేస్తుంటారు. అయితే ఈ నిబంధన విషయంలో సెన్సార్ బోర్డు ఇటీవల కాస్త కఠినంగా మారినట్టు తెలుస్తోంది. వర్మ సినిమా సెన్సార్ ఇష్యూ వచ్చిన తరవాత మరే ఇతర వివాదాల జోలికీ పోకుండా ఉండేందుకు సెన్సార్ బోర్డు ఈ రూల్‌ని పక్కాగా పాటించాలని అనుకుంటుందట. అందుకే.. ’90 ఎం.ఎల్’ కంటే ముందు దరఖాస్తు చేసుకున్న సినిమాలు పూర్తయిన తరవాతే.. మీ సినిమాకి సెన్సార్ చేస్తామని చెప్పడంతో సెన్సార్ ఆలస్యమైందని తెలుస్తోంది.
ఇప్పుడు ‘వెంకీ మామ’ సెన్సార్‌కీ ఇవే తిప్పలు తప్పకపోవొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ హడావుడిగా ప్రకటించేశారు. ఈనెలలో విడుదల కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు ప్రకారం.. వెంకీ మామ సెన్సార్ చేయడానికి చాలా టైమ్ ఉంది. సో.. వెంకీ మామకూ.. ఈ టెన్షన్ తప్పకపోవొచ్చు.