తెలుగు360 రేటింగ్: 2/5
కొంతమంది తెలుగు దర్శకులకు, రచయితలకూ, హీరోలకూ తెలుగు సినిమా కథ లోకువైపోయిందేమో అనిపిస్తుంది. ఓ పాయింట్ పట్టుకుంటారు. కథ అల్లేస్తారు. ఓ టైటిల్ అనుకుంటారు. స్క్రిప్టు మొదలెట్టేస్తారు. చిన్న చిన్న పాయింట్లతో సినిమాలు తీయడం తప్పేం కాదు. సగం సినిమాలు అలా పాయింట్ల నుంచి పుట్టుకొచ్చేవే. కానీ.. ఆ పాయింట్ జనాలకు నచ్చేలా, మెచ్చేలా తీయలేక, ఆ పాయింట్ చుట్టూనే కథ నడపలేక – బోల్తా పడుతున్నారు. 90 ఎం.ఎల్ కూడా ఇలాంటి `పాయింట్` కథే!
90 ఎం.ఎల్ టీజర్లూ, ట్రైలర్లూ చూస్తే ఆ పాయింట్ ఏమిటో అర్థమైపోతుంది. పూటకో 90 ఎం.ఎల్ తాగకపోతే… బతకలేని ఓ కుర్రాడి కథ ఇది. మూడు పూటలా బాటిల్ ఎత్తాల్సిందే. లేదంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రాణాలు పోతాయి. అందుకే… జేబులో 90 ఎం.ఎల్ పట్టుకుని తిరుగుతుంటాడు. అలాంటి అబ్బాయి అసలు మందు వాసనే పడని సువాసన (ఇదేం పేరు అని అడక్కండి. ఇలాంటి వెరైటీ పేర్లు సినిమాలో చాలా వినిపిస్తాయి) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్లదో క్లీన్ అండ్ గ్రీన్ కుటుంబం. మందు తాగే అబ్బాయికి తమ కూతుర్ని ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? అందుకే ప్రేమ వాళ్ల ఇంటి గేటు దగ్గరే ఆగిపోతుంది. అలాంటప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? ఆ అమ్మాయి ప్రేమని ఎలా పొందాడు? అనేదే కథ.
ఈ లైన్‌కి హీరో ఫ్లాటైపోయాడు. కాల్షీట్లతో పాటు, సినిమా తీసుకోమని డబ్బులు కూడా ఇచ్చాడు. పాయింట్‌కి లాక్ అయిన హీరో – స్క్రిప్టులో అంత కిక్ ఉందో లేదో మాత్రం జడ్జ్ చేయలేకపోయాడు. రెండు మూడు సీన్లు గడిచే సరికి ఆ ఒక్క పాయింట్ బోర్ కొట్టడం మొదలవుతుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు, లవ్ ట్రాకులు, ఫైట్లు, పాటలూ వచ్చి పడిపోతున్నా – దేనికీ కనెక్ట్ అవ్వలేకపోతాం. దానికి కారణం ఆయా సన్నివేశాల్లో దమ్ము లేకపోవడమే. కథ ఇదీ అని తెలియగానే ఇంట్రవెల్ బ్యాంగ్ ఏమిటో, క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయొచ్చు. సరిగ్గా ప్రేక్షకుల అంచనాలకు ఒక ఇంచు ఎక్కువ, ఒక ఇంచు తక్కువ కాకుండానే సినిమాని నడిపించాడు.
ఇలాంటి సినిమాలకు కావల్సింది ఆసక్తికరమైన సన్నివేశాలు. కథానాయకుడి బలహీనత నుంచి పుట్టుకొచ్చే వినోదం. ఇవి రెండూ ఈ సినిమాలో కొరవడ్డాయి. విలన్ ట్రాక్ మరీ టూమచ్ గా ఉంటుంది. ఆయనేమో రాత్రి తాగితే ఏం గుర్తుండదు. వెరైటీ డ్రస్సులు వేసుకుంటూ – బైబుల్ వాక్యాలు చదువుతూ – బుర్ర పాడు చేస్తుంటాడు. దాన్ని మనం వినోదం అని సరిపెట్టుకోవాలి. ఆయన్ని కామెడీ విలన్ అనుకోవాలో, సీరియస్‌గా గుర్తించాలో కూడా దర్శకుడికి క్లారిటీ లేకుండా పోయింది. విలన్ మరీ అంత బఫూన్ అయినప్పుడు – ఇక సినిమాలో సీరియెస్ నెస్ ఎక్కడి నుంచి వస్తుంది..? అలీ ట్రాక్‌లో కూడా కిక్ లేదు. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని లేపేసినా ఫర్వాలేదు. ఆ మాటకొస్తే అలా ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఏ సన్నివేశంలోనూ ఇంపాక్ట్ లేనప్పుడు, ప్రతీ ఎమోషన్ అరకొర పండినప్పుడు ప్రేక్షకుడు కథలోగానీ, కథానాయకుడి ప్రేమతో గానీ ఎక్కడ కనెక్ట్ అవుతాడు.
కనిపించిన ప్రతీ ఒక్కరికీ `నేను ఆర్థరైజ్డ్ డ్రింకర్` అని ఆధార్ కార్డు చూపించినట్టు – హెల్త్ కార్డు చూపించే హీరో… హీరోయిన్ దగ్గర మాత్రం ఎందుకు దాచాడు? – అసలు ఈ ప్రశ్న వేసుకుంటే సినిమా ఎప్పుడో ఖతం అయిపోయేది. ప్రేక్షకులకు ఈ బాధ తప్పేది. ఈ సినిమాలో అతి ముఖ్యమైన లవ్ ట్రాక్ కూడా ఎప్పుడో పట్టాలు తప్పేసింది. లవ్‌లో ఫీల్ లేనప్పుడు, హీరో – హీరోయిన్ కలవాలన్న భావన ప్రేక్షకుడిలో కలగనప్పుడు హీరో బాధనీ, ప్రేమనీ ఎందుకు ఓన్ చేసుకుంటారు. రెండు పేథాస్ గీతాలు వచ్చినా – ఎందుకు ఫీల్ అవుతాడు..?
కార్తికేయ యాక్షన్ సీన్లలో బాగా చేస్తాడు. డాన్సులు ఇరగ్గొట్టాడు. అయితే ఏం లాభం..? నటించాల్సివచ్చినప్పుడు పూర్తిగా డల్ అయిపోతున్నాడు. కామెడీ చేయాలని ప్రయత్నిస్తే చాలు.. అతనిలోని మైనస్సులు కనిపిస్తున్నాయి. సోలంకి అక్కడక్కడ చూడ్డానికి బాగుంది. కానీ… హీరోకి సరిపోలేదు. రావు రమేష్ నటనని వంక పెట్టలేం. అజయ్‌కి పూర్తి స్థాయి పాత్ర పడలేదు. రవికిషన్ అలవాటు ప్రకారం ఓవర్ చేశాడు.
తన సొంత సినిమా కాబట్టి కార్తికేయ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అనూప్ పాటల్లో కొన్ని బాగున్నాయి. అద్నాన్ సమీ పాడిన పాట – యూత్‌కి నచ్చుతుంది. వెళ్లిపోయిందే.. పాట కూడా ఓకే. అయితే పాటలో ఉన్న ఫీల్ కథలో లేదు. డాన్సులు, యాక్షన్ సీక్వెన్సులపై పెట్టిన శ్రద్ధ.. కథపై, సన్నివేశాల తీతపై పెట్టలేదు. దర్శకుడు అన్ని విభాగాల్లోనూ విఫలం అయ్యాడు. కేవలం పాయింట్‌తో సినిమాలు నడిపించలేమన్న సంగతి – 90 ఎం.ఎల్ మరోసారి నిరూపిస్తుంది.
ఫినిషింగ్ టచ్: కిక్ లేదు
తెలుగు360 రేటింగ్: 2/5