’96’ రీమేక్ కోసం రంగం సిద్ధమవుతోంది. శర్వా, సమంతలని ఎంచుకున్న దిల్‌రాజు అండ్ కో.. ఇప్పుడు మిగిలిన తారాగణంపై దృష్టి పెట్టింది. విజయ్ సేతుపతి పాత్రని రీప్లేస్ చేయడం చాలా కష్టమైన పని. శర్వా సమర్థుడే. కాకపోతే.. విజయ్ సేతుపతిలా మైమరపిస్తాడా, లేదా? అనేది పెద్ద ప్రశ్న. అన్నింటికంటే ముఖ్యమైన సవాల్ ఇప్పుడు దిల్‌రాజు ముందు ఉంది. అదేంటంటే… ఈ సినిమాలో శర్వా పాత్రలో రెండు ఛాయలుంటాయి. స్కూల్ రోజుల్లో శర్వాని, వయసు మీదపడిన శర్వాని తెరపై చూపించాలి. యంగ్ శర్వానంద్ కోసం దిల్‌రాజు ప్రస్తుతం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.
`96`లో జరిగిన మ్యాజిక్‌లలో కాస్టింగ్ ఒకటి. విజయ్ సేతుపతి కుర్ర వయసులో ఉన్నప్పుడు ఆదిత్య భాస్కర్ అనే కుర్రాడిని తెరపై చూపించారు. ఆదిత్యలో విజయ్ సేతుపతి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో ఆ రెండు పాత్రలకూ కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. త్రిష విషయంలోనూ అదే జరిగింది. గౌరి కిషన్ అనే అమ్మాయి యవ్వనంలో ఉన్న త్రిషలా కనిపించింది. త్రిషకీ, గౌరీకి సారుప్యతలు చాలా ఉంటాయి. దాంతో… ప్రేక్షకుడు పాత్రల మధ్య కంటిన్యుటీ అస్సలు మిస్ అవ్వలేదు. ఇప్పుడు సరిగ్గా దిల్ రాజు కూడా అదే చేయబోతున్నాడు. శర్వాలా కనిపించే కుర్రాడిని, సమంత పోలికలు ఉన్న అమ్మాయిని వెదికిపట్టుకోవడానికి కాస్టింగ్ కాల్ని ఆశ్రయించారు. వీరిద్దరూ దొరికితే… దిల్‌రాజుకి సగం సమస్య తీరిపోయినట్టే. మరి వాళ్లు దొరుకుతారా? లేదా? అనేదే పెద్ద ప్రశ్న.