ఏపీ ప్రభుత్వానికి లెక్కంటే లెక్క. పక్కాగా ఉంచేస్తుంది. నిన్నటికి నిన్న కల్యాణమస్తు అనే పథకానికి జీవో జారీ చేసి ఇప్పటికి తాము 98.44 శాతం హామీలు అమలు చేసేశామని గర్వంగా ప్రకటించేసుకుంది. ఈ పాయింట్ 44 శాతం ఎందుకంటే.. తాము పక్కాగా చెబుతున్నామని ప్రజలు అనుకోవడానికన్నమాట. మా లెక్క పర్ ఫెక్ట్ కాబట్టే అలా చెబుతున్నామని అనుకోవడానికి వేసే అతి తెలివితేటలు. ఈ లెక్క చెప్పి చెప్పామంటే చేస్తామంతే అని తనను తానే పొగుడుకుంది. అసలు చెప్పినవేవీ చేయలేదని. .. జీవోలు ఇస్తే అమలు చేసినట్లేనా అని ప్రజలు గగ్గోలు పెడుతూంటే పట్టించుకోవడంలేదు.
టీడీపీ హయాంలో అమలైన కల్యాణ మస్తు పథకం కింద మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల పేదలకు పెళ్లి సాయం చేసేవారు. ఆ పథకాన్ని జగన్ రాగానే నిలిపివేశారు. అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ మూడున్నరేళ్లు అసలు అమలు చేయలేదు. రెండేళ్ల కిందట కూడా ఈ జీవో ఇచ్చారు. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు ప్రచారం కోసం జీవో ఇచ్చారు. వచ్చే నెల ఒకటి నుంచే అమలు చేస్తామని చెబుతున్నారు. రెండేళ్ల కింద ఇచ్చిన జీవోను.. కేబినెట్ నిర్ణయాన్ని ఏం చేశారో మాత్రం చెప్పలేదు. మూడేళ్ల నుంచి పెళ్లిళ్లు చేసుకుని ప్రభుత్వ సాయంకోసం ఎదురు చూస్తున్న జంటలు లక్షకుపైగానే ఉన్నాయి. వారికి ఇస్తారో లేదో తెలియదు. కానీ ప్రచారం మాత్రం పీక్స్‌లో చేసుకోవడం ప్రారంభించారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఇలాంటి జీవోలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం పరుగులు పెడుతోంది. పథకాలన్నీ జీవోలపై అమలవుతాయి తప్ప ప్రజలకు అందవు. ఓ పది … ఇరవై మందికి ఇచ్చి అమలు చేశామని ప్రచారానికి వందల కోట్లు ఖర్చు పెట్టడం కామన్ అయిపోయింది. ఈ పథకమూ అంతే. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్.. విదేశీ విద్య పథకం కూడా అంతే. లబ్దిరారులు ఎవరూ ఉండకుండా నిబంధనలు తేవడం.. కానీ అర్హులందరికీ ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఏపీ ప్రభుత్వ స్టైల్.