విశాఖను సాఫ్ట్ వేర్ కంపెనీలకు వేదికగా చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చింది. ఆ సంస్థకు ఇప్పటికే తాత్కలిక భవనాలు కేటాయించారు. తాజాగా భారీ క్యాంపస్ పెట్టడానికి 22 ఎకరాలకుపైగా కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎకరం కేలవం 99 పైసలకే లీజుకు ఇస్తున్నారు. అంటే దాదాపుగా ఉచితం. మార్కెట్ క్యాపిటల్ లో ..ప్రపంచలోనే అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టీసీఎస్‌కు ఉచితంగా స్థలం ఇవ్వడం.. సమంజసమేనా ?
టీసీఎస్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా విశాఖ ఇమేజ్ పెరుగుతుంది. ఇంకా పలు ఐటీ కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ వచ్చే కంపెనీలు కూడా తమకు కూడా ఉచితంగా భూమి ఇవ్వాలని అడగడం సహజమే. ఎంత మందికని ప్రభుత్వం భూమిని ఉచితంగా కేటాయిస్తుందన్నది ప్రశ్న. టీసీఎస్ అయినా.. విశాఖలో క్యాంపస్ పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్ రేటుకు ప్రభుత్వం వద్ద తీసుకుంటే ఇంకా గొప్పగా ఉండేది. ఎందుకంటే ఆ సంస్థకు నిధుల సమస్య ఉండదు. లీజుకు కాకుండా నేరుగా తమ క్యాంపస్ స్థలాన్ని ఓన్ చేసుకున్నట్లుగా ఉండేది కానీ..ఆ టీసీఎస్ కూడా ప్రభుత్వం ఎంతో ఉత్సుకతతో ఉంది కాబట్టి స్థలం ఉచితంగా తీసుకున్నా తప్పు లేదని అనుకున్నట్లుగా కనిపిస్తోంది.
టీసీఎస్ అయినా ఏ కంపెనీ అయినా ప్రభుత్వం నుంచి భూములు లీజుకు తీసుకుంటే.. ఏ కారణంతో అయితే తీసుకున్నారో అదే కారణానికి మాత్రమే ఉపయోగించాలి. వేరే కారణంతో ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టీసీఎస్ తన క్యాంపస్ ను పెట్టడానికి పది వేలకుపైగా ఉద్యోగాలను కల్పించడానికి సిద్ధమయింది కాబట్టి ఆ భూమి కేటాయించారు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. లేకపోతే భూమిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది.