తెలుగు మీడియాలో జనసేన పార్టీకి హార్డ్ కోర్గా సపోర్ట్ చేసే ఒకే ఒక్క చానల్ 99టీవీ. ఆ చానల్ లో నెలకో సర్వే వేసి జనసేన పార్టీదే ఘన విజయం అని చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఆకాశానికి వెళ్లిపోయిందని.. ఆయనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఆ చానల్ ను చూసే కేశవ్ అనే జర్నలిస్టు ఆవేశపడుతూ ఉంటారు. గతంలో ఆయన చంద్రబాబు పాదయాత్రను కవర్ చేసి.. దానిపై ఓ పుస్తకం రాసి.. టీడీపీ అధికారంలోకి రాగానే ఐదేళ్ల పాటు .. ఓ పదవి కూడా అనుభవించారు.. అది వేరే విషయం.
ఇప్పుడు ఆ కేశవ్ అభిప్రాయాలు అర్జంట్‌గా మారిపోయాయి. ఇప్పుడు పవన్ ప్రభంజనం కూడా నేలకు పడిపోయింది. ఇప్పుడు ఎవరి ప్రభంజనం అంటే.. బీఆర్ఎస్ ప్రభంజనం వచ్చేసింది. ఏపీలోనూ సంచలనం సృష్టించబోతోంది. ఎందుకంటే.. ఆ పార్టీలో తోట చంద్రశేఖర్ చేరబోతున్నారు. తోట ప్రభంజనం వచ్చేసిందని నాలుగు చోట్ల పెట్టినఫ్లెక్సీలను చూపిస్తూ.. చెప్పిందే చెప్పడానికి తంటాలు పడుతున్నారు. ఈ చానల్ తీరు చూసి జనసైనికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. యూట్యూబ్ లో అన్ ఫాలో చేసుకుంటున్నారు.
ఈ చానల్ ను జనసేనలో చేరిన తర్వాత తోట చంద్రశేఖర్ కమ్యూనిస్టు పార్టీ వద్ద నుంచి కొనుగోలు చేశారు. జనసేన పార్టీ కోసం నడుపుతున్నారు. నిన్నటి వరకూ అంతే నడిపారు.కానీ హఠాత్తుగా ఆయన బీఆర్ఎస్లోకి జంప్ కావాలని నిర్ణయించుకోవడంతో.. పవన్ ను వదిలేసి.. ఇప్పుడు ఆ చానల్ కూడా బీఆర్ఎస్ బాట పట్టేసింది. ఈ చానల్ చూస్తున్న వారు కూడా.. ఓహో.. మీడియా ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా జనసేన పార్టీకి హార్డ్ కోర్ గా సపోర్ట్ చేసే ఒకే ఒక్క టీవీ చానల్ కూడా ఇప్పుడు ఆ పార్టీకి దూరమైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.