ఆమధ్య టీవీ ఛానళ్ళు కత్తి కట్టినట్టుగా జనసేన మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడం, ఎవరెవరినో తీసుకొచ్చి లైవ్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన మాటల దాడి చేయించడం, ఇవన్నీ చూశాక పవన్ కళ్యాణ్ మీడియాపై తిరగబడడం ,ఆ తర్వాత మీడియా చానళ్లు పవన్ వార్తల విషయంలో కినుక వహించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఉత్తరాంధ్ర పర్యటన వివరాలు టీవీ ఛానళ్లలో రావడంలేదని జనసేన అభిమానులు వాపోవడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ 99టీవీ చేజిక్కించుకోవడం , దాని తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు, ఆయన పర్యటనల లైవ్ కవరేజి లు ఈ ఛానల్ ద్వారా ప్రజలకు అందడం తెలిసిందే. అయితే ఈ ఛానల్ కి సంబంధించిన బాలారిష్టాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
మొదటి అంశం – కొన్ని కేబుల్ ఆపరేటర్ల వద్ద ఈ ఛానల్ కు సంబంధించిన ప్రసారాలు నిన్న మొన్న నిలిచిపోయాయి. అయితే పెద్ద ఆపరేటర్లు ఆయన ఎయిర్టెల్, డిష్ టీవీ, హత్ వే వంటి వాటిలో ప్రసారాలు యధాతధంగా కొనసాగుతున్నప్పటికీ మిగతా చిన్న చిన్న ఆపరేటర్ల వద్ద నుంచి వస్తున్న ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల జనసేన అభిమానులు లోకల్ కేబుల్ ఆపరేటర్లను సంప్రదిస్తే వారేమో “పై నుంచి” ప్రసారాలు ఆగిపోయాయని చెప్పడంతో జనసేన అభిమానులు మళ్లీ ఏదైనా రాజకీయం జరిగిందేమోనని కాస్త కంగారు పడ్డారు. అయితే ఆ ఆపరేటర్ల ని సంప్రదించి మాట్లాడితే తెలిసింది ఏమిటంటే 99 టీవీ వద్ద నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రసారాలు నిలిపి వేశారట. జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ఛానల్ ని చేజిక్కించుకున్నది ఇటీవలే అయినప్పటికీ, గత యాజమాన్యాల బకాయిలు కొన్ని ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ ప్రసారాలను ఆయా ఆపరేటర్లు ఆపివేశారు. అయితే “ఇంతకాలం అడ్డురాని బకాయిలు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డుగా వస్తున్నాయి .ఇప్పుడే ఎందుకు నిలిపివేస్తున్నారని” ప్రశ్నించిన అభిమానులకు ఆ ఆపరేటర్ల నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది గతంలో ఈ ఛానల్‌కి వ్యూయర్ షిప్ ( ప్రేక్షకాదరణ) లేదు కాబట్టి తాము కూడా బకాయిల విషయంలో పట్టుబట్ట లేదని, ఇప్పుడు వ్యూయర్ షిప్ పెరగడమే కాకుండా ఆ చానల్ లో కమర్షియల్ యాడ్స్ ( వాణిజ్య ప్రకటనలు) కూడా దర్శనమిస్తున్నాయి కాబట్టి తాము పాత బకాయిల గురించి పట్టుబడుతున్నామని చెప్పుకొచ్చారు. కాబట్టి ఎక్కడెక్కడ బకాయిల కారణంగానో, ఇతర కారణాలతోనో చానల్ ప్రసారాలు ఆగిపోయి ఉన్నాయో, ఈ ఛానల్ యాజమాన్యం వాటి మీద దృష్టి సారించాల్సి ఉంది.
ఇక రెండవ అంశం- తటస్థ ప్రేక్షకులను ఇంకా ఆకర్షించ లేకపోవడం. అయితే ఈమధ్యనే యాజమాన్యం మారింది కాబట్టి దీనికి ఇంకొంత సమయం పట్టవచ్చు. పైగా మొన్న జూన్ నెలాఖరు వరకు ఛానల్ లో పలు నియామకాల కోసం బయోడేటాలు ఆహ్వానించారు. ఇప్పటికైతే ఈ ఛానల్ చూస్తున్నది కేవలం జనసేన అభిమానులు మాత్రమే. ఆంధ్రజ్యోతి ఛానల్ పెట్టిన కొత్తలో ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ప్రముఖుడిపై చేసిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత ఆ చానల్ రూపురేఖలు మారిపోయాయి. చానల్ వ్యూయర్ షిప్ పెంచడానికి స్టింగ్ ఆపరేషన్లు చేయక్కర్లేదు కానీ ఎంతో కొంత ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఛానల్ ఇంకా వెనుకబడే ఉంది. ఈ ఛానల్ లో వచ్చే కొన్ని స్క్రోలింగులు- టీవీ9 తదితర చానళ్లలో స్క్రోలింగులు మక్కికి మక్కి దించినట్లు గా అప్పుడప్పుడు ఉంటున్నాయి.
మూడవ అంశం- ఒక తరహా సందిగ్ధత ఛానల్లో కనిపిస్తోంది. సాక్షి ఛానల్ లాగా తమ పార్టీ పట్ల ఏకపక్షంగా మద్దతిస్తూ వెళ్లాలా లేదంటే తటస్థ వైఖరి తో అన్ని వార్తలను తటస్థంగా చూపించాలా అన్న సందిగ్ధత కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక నాలుగవ అంశం విజువల్ క్వాలిటీ. గతంతో పోలిస్తే విజువల్ క్వాలిటీ కాస్త మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా, అవుట్ డోర్ లైవ్ ఇస్తున్న సందర్భాలలో మాత్రం విజువల్ క్వాలిటీ తక్కువ స్థాయిలో ఉంటుంది. బహుశా ఛానల్ యొక్క సాంకేతిక వనరులు ఇంకా మెరుగుపడాల్సి ఉన్నట్టు కనిపిస్తోంది.
అలాగే యాంకర్లు మొదలు డిబేట్లు నిర్వహించగల పరిఙ్ఞానమున్న ప్రయోక్తల అవసరం కూడా ఛానెల్ కి ఉంది. ఏదేమైనా బాలారిష్టాల నుంచి ఛానెల్ ఎప్పటికి బయటపడుతుందో చూడాలి
-జురాన్ (@CriticZuran)