డబ్బు కోసం ఏమైనా చేసే భారత క్రికెంట్ కంట్రోల్ బోర్డు, పాకిస్తాన్ తో సిరీస్ పై గట్టి పట్టుదలతో ఉంది. ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో సాధ్యం కాదనే ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా బోర్డు ఆలోచించి ఉంటే, ఉగ్రవాదం, క్రికెట్ ఏక కాలంలో అసాధ్యమని పాకిస్తాన్ బోర్డుకు చెప్పి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు శ్రీలంకంలో వచ్చే నెలలో సిరీస్ కోసం తహతహలాడుతోంది.
ఈ సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందని బోర్డు పెద్దలు నమ్మకంతో ఉన్నారు. మోడీ పార్టీకి చెందిన అనురాగ్ ఠాకూరే స్వయంగా బోర్డు కార్యదర్శి హోదాలో మోడీ ప్రభుత్వానికే లేఖ రాశాడు. కాబట్టి దీనికి ఆమోదం రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. సరిహద్దుల్లో దాదాపు ప్రతి రోజూ అలజడి. వాస్తవాధీన రేఖ సమీపంలో రోజూ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఆర్మీ పోస్టులపై విరుచుకు పడుతున్నారు. ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. మరెందరో గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో పాక్ తో క్రికెట్ ఆడి వినోదం పొందడం తప్ప, దేశం గురించి పట్టించుకోరా అని గురువారం రాత్రి టైమ్స్ నవ్ న్యూస్ చానల్ లో ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నకు కొందరు అవునన్నారు. కొందరు కాదన్నారు. అయినా, ప్రేక్షకుల్లో చాలా మంది ఈ సిరీస్ వద్దని ట్వీట్లు చేశారు. ముంబైలో కసబ్ గ్యాంగ్ దాడులు జరిపి ఏడేళ్లయిన సందర్భంగా ఆనాటి మారణకాండను జాతి బరువెక్కిన గుండెతో గుర్తు చేసుకునే వేళ, పాక్ తో సిరీస్ కు అనుమతి గ్యారంటీ అని బోర్డు పెద్దలు వెకిలి స్టేట్ మెంట్లు ఇవ్వడం చాలా మందికి బాధ కలిగించింది. వీళ్లకు డబ్బు తప్ప వేరే ధ్యాసే లేదా అని చాలా మంది ఛీత్కరించారు. ఈ సిరీస్ జరిగితే బోర్డుకు 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే అంత ఆత్రం. దీనికి అనుమతి ఖాయమని అనురాగ్ ఠాకూర్ చాలా ధీమాగా ఉన్నారు.
ఇంతకీ మోడీ ప్రభుత్వం ఈ సిరీస్ కు ఓకే చెప్తుందా? చెప్తే అంతకంటే విషాదం లేదు. ఓ వైపు భద్రతాదళాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే, జవాన్లు అమరులవుతుంటే ప్రభుత్వం కూడా అనాలోచితంగా జాతి ప్రయోజనాల కంటే వినోదానికి ప్రాధాన్యం ఇస్తే అంతకంటే దారుణం ఇంకోటి లేదని చాలా మంది ఆక్రోశిస్తున్నారు.