హైదరాబాద్: నటీనటులంటేనే ముఖం అందంగా కనిపించాలి. ముఖ సౌందర్యం కాపాడుకోవటం వారికి తప్పనిసరి అవసరం… అందులోనూ హీరోయిన్లు మరీ ముఖ్యంగా. ముఖానికేదైనా అయితే వారి కెరీర్ ముగిసిపోయినట్లే. అందుకే వారు ముఖం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు మాత్రం ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనట్లుంది. ఫలితం – ముఖంపై కాలిన గాయాలయ్యాయి.
హెయిర్ డిజైనర్ తన టాంగ్స్ను జారవిడవటంతో అది పడి తన ముఖంపై, మోచేతులపై కాలిన గాయాలయ్యాయని బిపాషా నిన్న ట్వీట్ చేసింది. గాయాల ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఆ హెయిర్ స్టైలిస్ట్ తనపై టాంగ్స్ను జారవిడిచింది కాకుండా కనీసం దానిని తీయనుకూడా తీయలేదని పేర్కొంది. ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, మచ్చలు పోవటానికి కొంత టైమ్ పడుతుందని ట్వీట్ చేసింది. బిపాషా ప్రస్తుతం టీవీకి గానూ ఒక హారర్ షో చేస్తోంది. ఆమె ఈ ఏడాది ‘ఎలోన్’ అనే ఒకే ఒక చిత్రంలో నటించింది. బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహామ్‌తో సుదీర్ఘకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్ నడిపిన ఆమె ప్రస్తుతం హేట్ స్టోరీ సిరీస్ చిత్రాల హీరో కరణ్ సింగ్ గ్రోవర్తో డేటింగ్ చేస్తోంది.