హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కనీవినీ ఎరగని రీతిలో నాలుగు లక్షల 59 వేల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్కు అంత మెజారిటీ రావటం అందరినీ నివ్వెరపాటుకు గురిచేసిందికూడా. అయితే ఆ పార్టీకి అంత మెజారిటీ రావటానికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో అవకతవకలు చేయటమేనని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ విడివిడిగా ఆరోపణలు చేశారు.
సర్వే సత్యనారాయణ ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎమ్లలో ట్యాంపరింగ్ వల్లే వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీకి అంత మెజారిటీ వచ్చిందని అన్నారు. ఇది ప్రజాతీర్పు కాదని చెప్పారు. దీనిపై రిటైర్డ్ జడ్జితో బహిరంగ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్టని తేలితే కేసీఆర్‌కు సలాం చేస్తానని, ట్యాంపరింగ్ జరిగినట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేయాలని అన్నారు. కేసీఆర్ విచారణ జరిపించకపోతే తానే కోర్టుకు వెళతానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్కు తీవ్ర వ్యతిరేకత కనిపించిందని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలను, మంత్రులను ప్రజలు నిలదీశారని చెప్పారు. ఉద్యమకాలంలోనూ టీఆర్ఎస్కు ఇంత భారీ మెజారిటీ రాలేదని, ఇప్పుడు ఇంత మెజారిటీ రావటానికి, కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకపోవటానికి ఈవీఎమ్లలో అవకతవకలే కారణమని చెప్పారు. కంటోన్మెంట్ ఎన్నికలనుంచే టీఆర్ఎస్ పార్టీ ఈవీఎమ్‌లను ట్యాంపరింగ్ చేయటం ప్రారంభించిందని సర్వే ఆరోపించారు(సర్వే కుమార్తె కంటోన్మెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు). ప్రచారంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు.
మరోవైపు గాలి వినోద్ కుమార్ నిన్న హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈవీఎమ్‌లను ట్యాంపరింగ్ చేయటంవల్లే టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించిందని అన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి, డబ్బు, మద్యం ఏరుల్లా పారించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలపై పాలకులను స్థానిక ప్రజలు ఎక్కడకెళ్ళినా నిలదీశారని, అయినా ఇంత మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో 15 లక్షలమంది ఓటర్లు ఉండగా, అందులో 7 లక్షలమంది నిరుద్యోగ యువతేనని చెప్పారు.