సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రధానిగా నరేంద్ర మోడి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనలో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, ప్రభుత్వంపై, పార్టీపై పట్టు చూసి పార్టీలో నేతలు, మంత్రులు, అధికారులే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా భయపడింది. చాలా రోజులపాటు మోడీ చెప్పిందే వేదం అన్నట్లుగా సాగింది. కానీ ఏడాదిన్నర వ్యవధిలోనే పరిస్థితి తారుమారు అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మోడీ ధాటిని తట్టుకోలేక లోక్ సభ వెనుక బెంచీలలో కునుకు దీసిన రాహుల్ గాంధీ ఇపుడు మోడీపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మోడీని ప్రాదేయాపడిన కాంగ్రెస్ ఇప్పుడు మోడీని అడుగు ముందుకు వేయనీయకుండా కట్టడి చేస్తోంది.
ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మొత్తం 36బిల్లులపై చర్చించి, ఆమోదించవలసి ఉంది. వాటిలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి.ఎస్.టి.) బిల్లు కూడా ఒకటి. క్రిందటిసారి సమావేశాలలోనే దానిని ప్రవేశపెట్టినపటికీ కాంగ్రెస్ పార్టీ దానిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి తిరస్కరించింది. సాధారణ జి.ఎస్.టి.కి అదనంగా రాష్ట్రాలు మరో ఒక్క శాతం అదనపు టాక్స్ వసూలు చేసుకొనేందుకు ఈ బిల్లు ద్వారా అనుమతిస్తున్నారు. దానిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లులో కాంగ్రెస్ పార్టీ ఒక సవరణ, ఒక అభ్యంతరం చెపుతోంది. అలాగే రెవెన్యూ న్యూట్రల్ రేట్ శాతం 18శాతం కంటే మించడానికి వీలులేదనే నిబంధనని విధించమని కోరుతున్నారు.
ఆ బిల్లును ఈసారయినా పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకొందామని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పటికీ, వారికి సోనియా గాంధీ అనుమతి లేదు కనుక హామీ ఇవ్వలేకపోయారు. కనుక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలో దిగారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి తన రేస్ కోర్సు రోడ్డులో తనతో కలిసి టీ త్రాగేందుకు రావలసిందిగా ఆహ్వానించారు. అందుకు వారిరువురూ అంగీకరించారని సమాచారం. జి.ఎస్.టి. బిల్లు ఆమోదానికి సహకరించవలసిందిగా వారిని అభ్యర్ధించేందుకే ప్రధాని మోడి వారిని ఈ టీ-సమావేశానికి ఆహ్వానించారు. కానీ వారు మోడీ అందించిన టీ తాగి ఆ బిల్లు ఆమోదానికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తారో లేక ఏమయినా కొత్త మెలిక పెడతారో చూడాలి.
పార్లమెంటు సమావేశాలు మొదలయినప్పుడు, మంత్రుల రాజీనామాలకు పట్టుబడుతూ, ఈవిధంగా బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుపడుతూ, సమావేశాలు లేనప్పుడు భూసేకరణ చట్ట సవరణలకు వ్యతిరేకిస్తూ, దేశంలో మత అసహనం పెరిగిపోతోంది అంటూ ఏదో ఒక అంశం భుజానికెత్తుకొని మోడీ ప్రభుత్వాన్ని తమ ముందు సాగిలపడేలా చేస్తున్నారు సోనియా గాంధీ. ఏడాదిన్నర వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై ఈవిధంగా సవారీ చేయగలగడం, అయినా మోడీ ఏమీ చేయలేకపోతుండటం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
కానీ సోనియా గాంధీ గ్రహించవలసింది ఏమిటంటే తన కొడుకు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ఆలోచిస్తునంత కాలం మోడీ ప్రభుత్వంతో ఎంత పోరాడినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే అతనికి పార్టీని దేశాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు లేవు. ఆమాట బయట వాళ్ళు ఎవరో అనడం లేదు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే అంటున్నారు. కనుక పార్టీ పగ్గాలను సమర్దుడయిన వ్యక్తికి అప్పగించి ఆ తరువాత మోడీ ప్రభుత్వంపై పోరాటం చేస్తే దాని వలన ఏమయినా ఫలితం ఉంటుంది.