హైదరాబాద్: నెల్లూరు బ్రదర్స్ ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలకు ఇవాళ ఫుల్స్టాప్ పెట్టేశారు. తెలుగుదేశంలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రం విడిపోయి రాజధానిని నిర్మించుకునే దశలో ఉందని వివేకానందరెడ్డి చెప్పారు. ఇప్పటినుంచి అందరూ సహకరిస్తేనే మరో 10,15 సంవత్సరాలలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఆ సామాజిక బాధ్యతతోనే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవులకోసం పార్టీలు మారే సంస్కృతి తమది కాదని అన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉందని అన్నారు. పదవులకోసం రాజకీయాలు చేయకూడదని, రాబోయే తరాలకోసం, బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలు చేయాలని చెప్పారు. తాము ఎవరికీ అడ్డు వెళ్ళబోమని, టాడీపీ నాయకుల వెంటే నడుస్తామని, అందరికీ ఏకైక నాయకుడు చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలన్నదే తమ అభిమతమని వివేకా అన్నారు. మరోవైపు రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో కలిసి పనిచేశామని చెప్పారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అందుకే చంద్రబాబుతో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మరోవైపు నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆనం బ్రదర్స్ రాకను స్వాగతించారు. నారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ఆనం బ్రదర్స్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. వారి చేరికపై చంద్రబాబుతో సంప్రదింపులు పూర్తయ్యాయని, అందరమూ కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు. మరోవైపు సోమిరెడ్డి మాట్లాడుతూ, పార్టీకి, చంద్రబాబుకు విధేయులుగా ఉండేవారెవరినైనా స్వాగతిస్తామని చెప్పారు.