హైదరాబాద్: క్షణం తీరికలేకుండా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో మునిగితేలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడికోసం తీరిక చేసుకున్నారు. తమ జన్మస్థలం నారావారిపల్లెలో మనవడు దేవాంశ్‌కు పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రమే నారావారి పల్లెకు చేరుకున్న చంద్రబాబు, ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్‌లతో కలిసి ఊరేగింపుగా కులదైవం నాగాలమ్మ గుడికి చేరుకున్నారు. చంద్రబాబు తెల్లపంచెను కట్టుకుని మనవడిని ఎత్తుకుని గుడివద్దకు నడిచివెళ్ళారు. కులదైవానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాంశ్‌కు పుట్టువెంట్రుకలు సమర్పించారు. నారా, నందమూరి కుటుంబాల సభ్యులు రావటంతో నారావారిపల్లెలో సందడి నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌస్‌కు సతీసమేతంగా వెళ్ళారు. వచ్చేనెల 23నుంచి 27వరకు అక్కడ ఆయుత చండీయాగం జరగనున్న సంగతి తెలిసిందే. చండీయాగానికి ముందు దంపతులిద్దరూ హవన పూజ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ దంపతులు ఇవాళ ఆ చండీ హవన పూజలు చేశారు. తర్వాత యాగానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాగస్థలికోసం వ్యవసాయక్షేత్రంలోని 20 ఎకరాల భూమిని చదును చేశారు. ఇందులో కొంతభాగంలో అల్లం పంట ఉండటంతో దానిని తీసే పనులను వేగిరపరిచారు. హవనపూజకోసం కేసీఆర్ నిన్న సాయంత్రమే ఫాంహౌస్‌కు చేరుకున్నారు.