నేడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు అందరూ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో మండల, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలపై చర్చించి అందుకు తగిన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తారు. అలాగే వచ్చే నెల 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే తెదేపా-బీజేపీ నేతల సమన్వయ సమావేశంలో పార్టీ తరపున ప్రస్తావించవలసిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పర్స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న కంబంపాటి హరిబాబు పదవీ కాలం త్వరలో ముగియబోతోంది కనుక ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుని ఎంపిక డిశంబర్ రెండవ వారంలో జరుగుతుంది. పురందేశ్వరి, సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కనుక నేటి సమావేశంలో ఆ విషయం గురించి కూడా బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది.