అమెరికాలో గన్ సంస్కృతి ఉనికిని చాటి చెపుతూ తరచూ ఎక్కడో అక్కడ కాల్పులు జరుగూతూనే ఉన్నాయి. నిన్న అమెరికాలోని కోలోరాడో స్ప్రింగ్స్ అనే నగరంలో ఒక వ్యక్తి స్థానిక ప్లాన్డ్ పేరెంట్ హుడ్ బిల్డింగ్ లోకి ప్రవేశించి లోపల ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దానిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంగతి తెలుసుకొన్న స్థానిక పోలీసులు, స్వాట్ కమెండో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని చాలా నేర్పుగా కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. గాయపడినవారిని అందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
‘ప్లాన్డ్ పేరెంట్ హుడ్’ అనే సంస్థ అవాంచిత గర్భాలను అబార్షన్ చేసి తొలగిస్తుంటుంది. దానిని దేశంలో ఒక వర్గం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అబార్షన్ చేయడం అంటే కడుపులో సజీవంగా పెరుగుతున్న బిడ్డలను హత్య చేయడమే అని వాదిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఆ వర్గానికి చెందిన వ్యక్తా లేక మరెవరయినానా? అసలు ఎందుకు దాడి చేసాడు? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలవలసి ఉంది.
అమెరికాలో గన్ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొన్నందునో లేక తమ సంస్థపై ఇటువంటి దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించడం వలననో ‘ప్లాన్డ్ పేరెంట్ హుడ్’ సంస్థ వారు తమ సంస్థ నడుస్తున్న బిల్డింగులో ఒక “ ప్రత్యేక సేఫ్టీ రూమ్” ఏర్పాటు చేసుకొన్నారు. దాడి మొదలయిన వెంటనే అందరినీ ఆ సేఫ్టీ రూమ్ లోకి తరలించడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడగలిగారు.